మద్యం స్కాంలో మొత్తం చెప్పేసిన ప్రణయ్.. నిందితులు పక్కాగా ఇరుకున్నట్లేనా?
ఏపీ లిక్కర్ స్కాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగంగా పావులు కదుపుతోంది. ఈ కేసులో అరెస్టు అయిన, అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులకు వ్యతిరేకంగా కీలక ఆధారాలు సేకరిస్తోందని అంటున్నారు.
By: Tupaki Desk | 24 Jun 2025 2:00 PM ISTఏపీ లిక్కర్ స్కాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగంగా పావులు కదుపుతోంది. ఈ కేసులో అరెస్టు అయిన, అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులకు వ్యతిరేకంగా కీలక ఆధారాలు సేకరిస్తోందని అంటున్నారు. ప్రధానంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాత్రను నిర్ధారించే సాక్ష్యాధారాలు సిట్ అధికారులకు లభ్యమైనట్లు చెబుతున్నారు. తొలి నుంచి లిక్కర్ డబ్బు వసూలు, పంపిణీలో కీలకంగా, క్రియాశీలంగా వ్యవహరించిన కట్టా ప్రణయ్ ప్రకాశ్ న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంతో చెవిరెడ్డి అండ్ బ్యాచ్ చిక్కుకున్నట్లేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లిక్కర్ స్కాం దర్యాప్తులో సిట్ పురోగతి సాధించినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారును గుర్తించే క్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పాత్ర బయటపడిందని అంటున్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఖర్చుల కోసం చెవిరెడ్డి ద్వారా సుమారు రూ.250 కోట్లు తరలించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. చెవిరెడ్డికి ఆ డబ్బు అప్పగించిన వ్యక్తిగా చెబుతున్న కట్టా ప్రణయ్ ప్రకాశ్ న్యాయమూర్తి ఎదుట కీలక వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రణయ్ వాంగ్మూలంతో చెవిరెడ్డితోపాటు ఇతర నిందితులు ఇరుక్కున్నట్లు భావిస్తున్నారు.
మద్యం కేసులో ప్రణయ్ ప్రకాష్ దొరకనంత వరకు మందకొడిగా సాగిన విచారణ.. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాయువేగం పుంజుకున్నట్లు చెబుతున్నారు. ఏ1 నిందితుడు రాజ్ కసిరెడ్డి, ఇతర నిందితులు కిరణ్ కుమార్ రెడ్డి, చాణక్యల ఆదేశాలతో తాడేపల్లిలో లిక్కర్ డబ్బు కోసం ప్రణయ్ డెన్ ఏర్పాటు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారని అంటున్నారు. డిస్టలరీలు, మద్యం కంపెనీల నుంచి లిక్కర్ కమీషన్ ముందుగా తాడేపల్లి వచ్చేదని, అక్కడ నుంచి చెవిరెడ్డి అనుచరులైన బాలాజీ, గిరి, గన్ మన్ మదన్ రెడ్డి, నవీన్ తదితరులకు డబ్బును అందించేవారని సిట్ చెబుతోంది.
ప్రణయ్ వాంగ్మూలం ప్రకారం లిక్కర్ కమీషన్ గా వచ్చిన డబ్బుతో విదేశాల్లో మైనింగ్ వ్యాపారం చేయాలని భావించారని అంటున్నారు. జాంబియా, టాంజానియా, జింబాబ్వే వంటి ఆసియా దేశాల్లో మైనింగ్ వ్యాపారం చేసేందుకు సంప్రదింపులు జరిగాయని, ఈ ఏడాది జనవరిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి విదేశాలకు వెళ్లి స్థల పరిశీలన కూడా చేశారని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే చాణక్య సూచనతో ప్రణయ్ దుబాయ్ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఆఫ్రికాలో చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడు కలిసి ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ పెట్టాలని భావించారని, అందులో తనకు ఉద్యోగమిస్తామని చెప్పారని ప్రణయ్ వాంగ్మూలమిచ్చాడని అంటున్నారు.
రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి సూచనల మేరకు జాంబియా, జింబాబ్వే, టాంజానియాల్లో పర్యటించి ఐరన్ ఓర్ వ్యాపారంపై వివరాలు సేకరించానని ప్రణయ్ చెప్పాడని సమాచారం. ఈ క్రమంలోనే టాంజానియాలో ఫ్యాక్టరీ పెట్టేందుకు నిర్ణయించుకుని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డితో కలిసి దుబాయ్ లో అరైజ్ గ్రూప్ సీఈవో గగన్ గుప్తాను కలిశామని ప్రణయ్ తెలిపాడు. టాంజానియాలో అరైజ్ సంస్థ కార్యకలాపాలను నివేద్ శెట్టి అనే వ్యక్తి చూస్తుంటారని, ఆయన అక్కడ కంపెనీ పెట్టేందుకు సహకరిస్తానని చెప్పినట్లు ప్రణయ్ వెల్లడించాడు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తాను జింబాబ్వే వెళ్లానని, మాజీ ఎమ్మెల్యే భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు కూడా అక్కడికి వచ్చారని, అంతా కలిసి నివేద్ శెట్టిని కలిసి ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ పెట్టేందుకు చర్చించామని ప్రణయ్ తెలిపాడు. ఈ వ్యాపారాలకు లిక్కర్ స్కాంలో వసూలు చేసిన కమీషన్ డబ్బునే పెట్టుబడిగా వాడాలని నిర్ణయించినట్లు ప్రణయ్ వాంగ్మూలంతో వెల్లడైందని అంటున్నారు.