ఉచిత బస్సు పథకంపై చంద్రబాబు ప్రకటన.. వైసీపీ అనుమానాలపై క్లారిటీ
ఇక మరో నెల రోజుల్లో ఉచిత బస్సు అందుబాటులోకి రానుండటంతో వైసీపీ విమర్శలకు చెక్ పెట్టినట్లేనని అంటున్నారు.
By: Tupaki Desk | 8 July 2025 6:38 PM ISTసూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఉచిత బస్సు పథకంపై నియమ, నిబంధనలు ఏంటి? అన్న ప్రశ్నకు ఇంతవరకు ఎవరూ సమాధానం చెప్పలేదు. ఉచిత బస్సు సౌకర్యం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారా? లేక జిల్లా పరిధి వరకే అనుమతిస్తారా? అన్న సందేహాలు అందరినీ వెంటాడుతున్నాయి. దీనిపై ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత క్లారిటీ ఇచ్చారు.
శ్రీశైలం జలాశయం నుంచి జలాలను విడుదల చేసేందుకు నంద్యాల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు పథకంపై క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా బస్సులు ఉచితంగా ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో జిల్లాసర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు అందుబాటులో ఉంటుందని క్లారిటీ వచ్చినట్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే సదుపాయం లేనట్లేనని ముఖ్యమంత్రి మాటలు బట్టి అర్థమవుతుందని అంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఉచిత బస్సు పథకంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పథకం అమలు చేయాలంటే అదనపు బస్సులు, సిబ్బందిని నియమించాల్సివుందని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి అదనపు సిబ్బందిని నియమించే పరిస్థితి లేకున్నా, కొత్తగా కొన్ని సర్వీసులు ప్రవేశపెట్టనున్నారని అంటున్నారు.
ఇక మరో నెల రోజుల్లో ఉచిత బస్సు అందుబాటులోకి రానుండటంతో వైసీపీ విమర్శలకు చెక్ పెట్టినట్లేనని అంటున్నారు. అయితే జిల్లా పరిధి వరకే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయడం వల్ల ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రానికి వెళ్లాంటే పక్క జిల్లాల మీదుగా ప్రయాణించాల్సివుంటుంది. అలాంటి వారికి ఈ నిబంధన వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఏదిఏమైనా మరో నెల రోజుల తర్వాత ఉచిత బస్సు పథకం ప్రారంభమయ్యాకే పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు.