Begin typing your search above and press return to search.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే... సాకేత్ కు డిప్యూటీ కలెక్టర్ పోస్టు!

ఇదే సమయంలో... అసైన్డ్‌, దేవాదాయ, లంక భూములపై జాయింట్ కలెక్టర్ తో దర్యాప్తు చేయిస్తామని చెప్పిన పార్థసారథి... సర్వే సమయంలో సరిహద్దుల వద్ద సమస్యలు రాకుండా చూస్తామని అన్నారు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 9:00 PM IST
ఏపీ కేబినెట్  కీలక నిర్ణయాలివే... సాకేత్  కు డిప్యూటీ కలెక్టర్  పోస్టు!
X

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా... రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూసమీకరణ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకేరకమైన రూల్స్‌ తో ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలని నిర్ణయించింది.

అవును... నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా అమరావతిలో మౌలిక వసతుల కొసం మరోసారి భూసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇందులో భాగంగా.. ఎన్‌.జీ.టీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జలవనరులను రక్షిస్తామని తెలిపారు.

ఇదే సమయంలో... అసైన్డ్‌, దేవాదాయ, లంక భూములపై జాయింట్ కలెక్టర్ తో దర్యాప్తు చేయిస్తామని చెప్పిన పార్థసారథి... సర్వే సమయంలో సరిహద్దుల వద్ద సమస్యలు రాకుండా చూస్తామని అన్నారు. స్థానిక రైతులకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. ప్రధానంగా.. గతంలో పునాదులు పూర్తయిన భవనాలను ముందుగా పూర్తి చేస్తామని అన్నారు.

అదేవిధంగా... స్పోర్ట్స్ కోటాలో టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌ సాయికి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇవ్వాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు కూడా 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిందే. నాడు ఆమె గొల్లపూడిలోని ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయంలో విధుల్లో చేరారు.

ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి!

* పురపాలకశాఖలో 40 బిల్డింగ్‌ ఇన్‌ స్ట్రక్టర్ల పోస్టుల అప్‌ గ్రేడ్‌ కు ఆమోదం తెలిపింది.

* మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటు

* తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాలను పర్యాటకశాఖకు బదిలీ

* పర్యాటక ప్రాంతం గండికోట వద్ద రిసార్టు ఏర్పాటు కోసం 50 ఎకరాలు కేటాయింపు

* శ్రీశైలం డ్యామ్‌, సర్ ఆర్దర్ కాటన్ బ్యారేజీ సేఫ్టీ పనుల కోసం రూ.350 కోట్ల నిధుల విడుదల.

* రాష్ట్రంలో 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌ గ్రేడ్‌

* ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు కోసం రూ.273.17 కోట్లు మంజూరుకు అనుమతులు.