Begin typing your search above and press return to search.

సీఎం ఆదేశాలతోనే ఏసీబీ దాడులు?.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై చంద్రబాబు సీరియస్!

రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలే కారణమని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   6 Nov 2025 5:41 PM IST
సీఎం ఆదేశాలతోనే ఏసీబీ దాడులు?.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై చంద్రబాబు సీరియస్!
X

రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి పెరిగిపోతోందని, అక్రమాలకు అలవాటు పడిన అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ప్రజలను దోచేస్తున్నారని సీఎంవోకు ఫిర్యాదులు వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో తన ఆధీనంలోనే ఉన్న ఏసీబీకి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సమగ్ర తనిఖీలు చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి ఆదేశాలు ఉండటంతోనే ఏసీడీ డీజీ పర్యవేక్షణలో దాడులు జరిగాయని చెబుతున్నారు. లండన్ నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ఏసీబీ తనఖీల సమాచారంపై ఆరా తీశారని కూడా చెబుతున్నారు. సీఎంకు అందినట్లే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వ్యవహారాలు జరుగుతున్నట్లు ఏసీబీ తనిఖీల్లో గుర్తించిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల విధానంతో అక్రమాలు పెరిగిపోయాయని అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. అక్రమార్కులతో చేతులు కలుపుతున్నసబ్ రిజిస్ట్రార్లు కొందరు తప్పుడు రికార్డులు, చుక్కల భూములు, నిషేధిత భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఓ ఉన్నతాధికారి, ఆయనతో సన్నిహితంగా ఉంటున్న సబ్ రిజిస్ట్రార్లపై సీఎంవోకు భారీగా ఫిర్యాదులు వెళ్లినట్లు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాకు చెందిన ఓ సబ్ రిజిస్ట్రార్ అక్రమాలకు బాగా అలవాటు పడి ఆ సీటు ఖాళీ చేయడం లేదని, ఆయన అడ్డుగోలు వ్యవహారంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయంటున్నారు. ఆ సబ్ రిజిస్ట్రార్ తన సీటు కోసం ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి వెనుకడాటం లేదని ప్రభుత్వానికి ఉప్పందింది. ఈయన ఒక్కడే కాకుండా సంబంధిత ఉన్నతాధికారి రాష్ట్రంలో 34 ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తున్నట్లు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ సమాచారం అందిందని అంటున్నారు. దీంతో ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏం జరుగుతుంతో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏసీబీని పురమాయించిందని అంటున్నారు.

సీఎం సూచనలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. దాదాపు ప్రతిచోటా అక్రమాలను గుర్తించినట్లు సమాచారం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు కుమ్మక్కై వసూళ్లకు పాల్పడటం, ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని లంచాలు తీసుకుంటున్నట్లు ఏసీబీ గుర్తించిందని అంటున్నారు. బుధవారం ఏసీబీ తనిఖీల సందర్భంగా డబ్బు పారేసి వెళ్లిపోయిన వారిని కూడా గుర్తించారని, ఈ విషయాలపై సీఎం చంద్రబాబుకి సమగ్ర నివేదిక సమర్పించనున్నారని చెబుతున్నారు. దీంతో సీఎం యాక్షన్ ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిక్ గా మారుతోంది. ఏసీబీ తనిఖీలు జరుగుతున్న సమయాల్లోనే ఆయా కార్యాలయాలకు జిల్లా రిజిస్ట్రార్లను పంపిన ప్రభుత్వం.. శాఖాపరమైన నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ రెండు నివేదికలు అందిన తర్వాత అక్రమాలకు బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో ఇటీవల కాలంలో ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లపైనా విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిషేధిత భూములు ఏమైనా రిజిస్టర్ చేశారా? ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా ఏమైనా అడ్డదారులు తొక్కారా? అనేది కూడా శాఖాపరమైన విచారణలో గుర్తించాలని ప్రభుత్వం ఆదేశాలించినట్లు చెబుతున్నారు.