'నాన్నా బుజ్జి': 'బుజ్జి' కమీషన్లు.. 'నాన్న'సెటిల్‌మెంట్లు..!
రాజకీయంగా దూకుడుగా ఉండే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ నియోజకవర్గం.. రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉంటుంది
By: Tupaki Desk | 16 May 2025 2:00 PM ISTరాజకీయంగా దూకుడుగా ఉండే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ నియోజకవర్గం.. రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉంటుంది. పైగా.. దీనిని రాజధాని ప్రాంతంలో కలపాలన్న ప్రతిపాదన కూడా ఇటీవల తెరమీదకి వచ్చింది. దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకుంది. దీనిని అదునుగా చేసుకున్న ఓ ఎమ్మెల్యే రంగంలోకి దిగిపోయారు. తన నియోజకవర్గంలోని రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖులుగా ఉన్నవారితో భేటీ అయ్యారు. అన్నీ `బుజ్జి` చూసుకుంటాడని చెప్పారు.
ఇది జరిగి వారం అయింది. అత్యంత రహస్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఆయన భేటీ అయి.. చర్చ లు జరిపారు. ''మీరు ఎలా అయినా.. చేసుకోండి మేం సహకరిస్తాం. మా `బుజ్జి` చెప్పినట్టు చేయాలి. అంతే'' అని ఒకే ఒక్క షరతు విధించారు. అయితే.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సాధారణంగా ఇచ్చే మామూళ్లే కదా అనుకున్నారు. కానీ.. తీరా బుజ్జి రంగంలోకి దిగినాక.. పరిస్థితి మొత్తం యూటర్న్ తీసుకుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
ప్రతి గజానికీ లెక్కగట్టి.. కమీషన్లు ఇవ్వాలని సదరు బుజ్జి డిమాండ్ చేస్తున్నారు.ఇక, ఇసుక, మట్టి వ్యవ హారాల్లో వచ్చే మామూలు.. ఇచ్చే మామూళ్లు మామూలేనని తేల్చి చెప్పారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు... ఇదెక్కడి అన్యాయం అంటూ.. విషయాన్ని `చిన్నబాబు` దృష్టికి తీసుకువచ్చారట. ప్రస్తుతం ఈ వ్యవహారం.. సదరు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక, ఎమ్మెల్యే గారు సెటిల్ మెంట్ల లో బిజీగా ఉన్నారని మరోటాక్ వినిపిస్తోంది.
సాధారణంగా కోర్టుల వద్ద పరిష్కారం కాని.. కేసులు, మధ్యవర్తుల ద్వారా పరిష్కారం అయ్యే కేసులను ఆయన తన దగ్గరకు తెప్పించుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా బాగానే చేతులు తడుపుకొంటున్నారని.. సొంత పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే.. ఫైర్ బ్రాండ్ కావడంతో ఎవరూ నోరు విప్పడం లేదు. అటు బుజ్జి.. ఇటు.. ఎమ్మెల్యే గత నాలుగు మాసాలుగా ఇదే పనిలో ఉన్నారని.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న నియోజకవర్గంలో తమ్ముళ్లు చెబుతున్న మాట. మరి చంద్రబాబు కంట్రోల్ చేస్తారో.. లేక అలానే వదిలేస్తారో చూడాలి.