అమరావతిలో బాలయ్య రికార్డు.. తొలి ఆస్పత్రికి భూమి పూజ
తుళ్లూరు సమీపంలో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో అత్యాధునిక వసతులు సమకూర్చనున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
By: Tupaki Desk | 13 Aug 2025 1:45 PM ISTఏపీ రాజధాని అమరావతిలో తొలి ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ జరిగింది. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చైర్మన్ గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. తుళ్లూరు సమీపంలో క్యాన్సర్ కేర్ క్యాంపస్ నిర్మాణానికి గతంలో ప్రభుత్వం 21 ఎకరాలను కేటాయించింది. దీంతో రాజధానిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ నిర్మాణానికి బసవతారకం ఆస్పత్రి చర్యలు తీసుకుంది.
ప్రస్తుతం రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రైవేటు నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముందుగా సీఎం చంద్రబాబు తన సొంత ఇంటిని నిర్మిస్తున్నారు. ఈ విధంగా పలు ప్రైవేటు సంస్థలు తమకు కేటాయించిన భూముల్లో పనులు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో గతంలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, డీమ్డ్ యూనివర్సిటీలు నిర్మించారు. ఇక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే రాజధానిలో తొలి ఆస్పత్రి అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని అంటున్నారు.
తుళ్లూరు సమీపంలో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో అత్యాధునిక వసతులు సమకూర్చనున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో అంకాలజీ సేవలు అందించనున్నారు. రూ.750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, ఆధునాతన పరికరాలు సమకూరుస్తారు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర ప్రక్రియలకు ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్ తో ఏర్పాటు చేసి 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభించాలని భావిస్తున్నారు. రెండో దశలో వెయ్యి పడకల స్థాయికి విస్తరించి ప్రత్యేక విభాగాలు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా క్లిష్టమైన అధునాతన క్యాన్సర్ కేసులకు ప్రాంతీయ రిఫరల్ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.