Begin typing your search above and press return to search.

జగనే నయమా...ఇదే చేదు నిజమా ?

ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రీం ప్రాజెక్ట్ అమరావతి రాజధాని. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని పరితపిస్తున్నారు.

By:  Satya P   |   13 Aug 2025 11:00 PM IST
జగనే నయమా...ఇదే చేదు నిజమా ?
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే నయం అని అనుకుంటున్నారా. జగన్ జమానాయే బాగుంది అని నిట్టూరుస్తున్నారా. జగన్ పాలనతో ప్రస్తుతం ఉన్న కూటమి పాలనను సరిపోలుస్తున్నారా. చేదు నిజాలు చెబుతున్నారా లేక లోతుగా తరచి విశ్లేషిస్తున్నారా. అసలు ఈ తరహా మాటలు ఎందుకు వినవస్తున్నాయి. వినిపిస్తే ఎక్కడ నుంచి వస్తున్నాయి. ఇవన్నీ ప్రశ్నలే. జవాబులు చూస్తే సింపుల్ గా అనిపించినా ఔరా అని విస్మయం కలిగించేలాగే ఉన్నాయి.

డ్రీం సిటీలోనే అలా :

ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రీం ప్రాజెక్ట్ అమరావతి రాజధాని. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని పరితపిస్తున్నారు. అతి పెద్ద తపస్సు చేస్తున్నారు. ఎన్నో సవాళ్ళు, మరెన్నో పరీక్షలు తట్టుకుని ఆయన ముందుకు సాగుతున్నారు. రానున్న దశాబ్దాలు కాదు సమీప శతాబ్దాలలో అమరావతి రాజధాని సరిసాటి మరొకటి లేకుండా ఉండాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్. అయితే ఆ డ్రీం సిటీ నుంచే బాబు పాలన మీద కొంత అసహనం వ్యక్తం అవుతోందంటే అది సంభ్రమాశ్చర్యం కలిగించే విషయమే. అంతే కాదు జగనే నయం అని వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు అంటే కూడా అది విడ్డూరమే.

అక్కడే అసలైన వ్యతిరేకత :

ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు అమరావతి రైతులు. రాజధానికి వెన్నెముకగా నిలిచి తమ భూములు ఇచ్చిన త్యాగధనులు ముక్కారు పంటలు పండే భూములను తరాలుగా వస్తున్న సంపదను తమ ఆస్తిని తమ తాత ముత్తాలను ఆ విధంగా చూసుకుంటూ మురిసిపోయే వారసత్వ జ్ఞాపకాలను సైతం ఏపీ రాజధాని కోసం చాలా విశాలంగా ఆలోచించి త్యాగం చేసిన రైతులు. వారంతా బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని భావించి అలా ఇచ్చారు. అందులో తామూ ఉండొచ్చని అందరి రాజధాని కలలను నిజం చేసిన వారుగా చరితార్ధులు కావచ్చని తలపోసారు. కానీ వారే గత పదకొండేళ్ళుగా సాగుతున్న రాజధాని వ్యవహారాలను చూసి వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు.

ఇవే కారణాలుగా :

రాజధాని రైతులలో వ్యతిరేకత రావడానికి కీలకమైన కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి వారి భూములకు ఈ రోజుకూ ప్లాట్స్ గా డెవలప్మెంట్ చేసి ఇవ్వలేదన్న ఆవేదన ఉంది. ఒక దశాబ్దం పైగా పుణ్య కాలం వెళ్ళిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 14 నెలలు ఇట్టే గడచిపోయాయి. రాజధాని పేరుతో సాగుతున్న భారీతనం వల్ల ఎక్కడికి ఏ విధంగా ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందో తెలియని అయోమయం కూడా ఉంది అంటున్నారు. అందుక ప్లాట్స్ వేగంగా ఇవ్వాలని తపన పడుతున్నారు.

ఇక రెండవ విషయానికి వస్తే అమరావతి రాజధాని అని ఎంతగా రాష్ట్ర ప్రభుత్వం బల్లగుద్దుతున్నా కూడా దానికి అధికారిక రాజముద్ర అయితే లేదు అన్నది ఉంది. కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఆమోదిస్తూ రాష్టపతికి పంపిస్తే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రాజముద్ర పడుతుంది. అది కనుక జరిగితే అమరావతి రాజధాని ఎక్కడికీ పోదు అన్న నిబ్బరం రైతులకు కలుగుతుంది. అందుకే వారు అలా కోరుకుంటున్నారు. ఇక మూడవది ప్రస్తుతం అంటే 11 ఏళ్ల క్రితం తీసుకున్న 33 వేల ఎకరాలకే ఇంకా రూపూ రేఖా రాలేదు. మళ్ళీ 25 వేల ఎకరాలు భూసమీకరణ ఎందుకు అన్నదే అమరావతి రైతులకు పట్టుకున్న బాధ. అలా చేయడం వల్ల తమ ప్రాధాన్యతలు కూడా పక్కకు పోతాయని వారి నిర్వేదం. ఈ కారణాలతోనే వారు అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం వేస్తున్న అడుగుల పట్ల కొంత వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు.

బాబు కంటే ఆయనే :

చంద్రబాబు కంటే జగనే నయంగా ఉంది. ఇంకా మా భూములు లాగేసుకుంటాం, ఏదో చేస్తామని తీసేసుకోలేదు అని అంటున్నారు. మా సామాజిక వర్గం అయితే అయి ఉండవచ్చు కాక కానీ మా నెత్తి మీద పాలు పోస్తారంటే నిప్పులు కురిపిస్తున్నారు అని అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది. అమరావతి అంటేనే కేరాఫ్ టీడీపీగా అన్నంతగా ఉన్న చోట ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది కాస్తా ఆలోచించులోవాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు.