రాజధాని రైతుల్లో ఇంకా ఆ భయం.. ఈ సారి మోదీపై గట్టి ఆశలు..
రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఎంత గట్టిగా పనిచేస్తున్నా, రైతుల్లో నమ్మకం పెంచలేకపోతోందని అంటున్నారు.
By: Tupaki Desk | 29 April 2025 8:57 PM ISTరాజధాని పునఃనిర్మాణ పనులకు వేగంగా అడుగులు పడుతున్నా, అమరావతికి భూములిచ్చిన రైతుల్లో భయం పోలేదని ప్రచారం జరుగుతోంది. పదేళ్లు కావస్తున్నా, రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడం రైతులను కలవరపెడుతోందని అంటున్నారు. ఈ కారణంగానే ప్రధాని మోదీ పర్యటనకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పనుల పునఃప్రారంభానికి ముందే గెజిట్ నోటిఫికేషనుపై స్పష్టత కావాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఎంత గట్టిగా పనిచేస్తున్నా, రైతుల్లో నమ్మకం పెంచలేకపోతోందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం వైసీపీ పాలనలో ఎదుర్కొన్న అవమానాలు, వేధింపులే అని అంటున్నారు. రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి 34 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా వదులుకున్నారు. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇస్తామని అప్పట్లోనే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా రైతులకు కౌలు కూడా చెల్లిస్తామని చెప్పింది. 2015-19 మధ్య ఈ దిశగా కొంత ముందడుగులు పడినా, 2019 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ రాజధాని విషయంలో వైఖరి మార్చుకోవడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వారికి మద్దతుగా అన్నివర్గాల వారు పోరాడారు. అయితే 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారి మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో రాజధాని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో రాజధాని పనులను పరిగెత్తించేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. అయితే రైతుల్లో మాత్రం ఇంకా జగన్ భయం తొలగిపోలేదని అంటున్నారు. ఎన్ని వేల కోట్ల పనులు చేసినా, మళ్లీ ప్రభుత్వం మారితే రాజధాని మార్చేస్తామనే ప్రతిపాదన వస్తే ఏం అవుతోందనే భయం ఇప్పటికీ రాజధాని రైతుల్లో వ్యక్తమవుతోందని అంటున్నారు.
దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం కాదని ఈ విషయంపై ప్రధాని మోదీతోనే తేల్చుకోవాలని కొందరు రాజధాని రైతులు కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఈ విషయంలో ఇక ఎంత మాత్రం ఆలస్యం జరగకూడదని రైతులు కోరుకుంటున్నారు. రైతుల ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సోమవారం వారితో సమావేశమై అమరావతిపై పార్లమెంటులో చట్టం చేయిస్తామని ప్రకటించారు. అయితే గతానుభవాల నేపథ్యంలో కేంద్రమే అమరావతికి రక్షణ కల్పించాలని ఉద్దేశంతో మే 2వ తేదీన అమరావతికి వస్తున్న ప్రధానికి వినతిపత్రం ఇవ్వాలని కొందరు రైతులు భావిస్తున్నారు. దీనిపై రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రధానిని ఎలా కలవాలి? ఎప్పుడు అనుమతి తీసుకోవాలి? ఎవరి ద్వారా కలవాలి? అనే విషయాలపై రాజధాని రైతుల్లో చర్చ జరుగుతోందని చెబుతున్నారు.