35వేల అడుగుల ఎత్తులో అస్వస్థత.. ఎయిరిండియాలో ఏమి జరిగింది?
ఎయిరిండియా సంస్థకు చెందిన విమానాలకు సంబంధించిన మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 24 Jun 2025 12:59 PM ISTఎయిరిండియా సంస్థకు చెందిన విమానాలకు సంబంధించిన మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బంది సహా సుమారు 11 మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై జాతీయ మీడియాలో కథనాలు రాగా.. ఎయిరిండియా తాజాగా ధృవీకరించింది!
అవును... మీడియాలో వస్తోన్న కథనాల ప్రకరం.. సోమవారం లండన్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఆరుగురు క్యాబిన్ సిబ్బందితో సహా కనీసం 11 మంది తల తిరుగుతున్నట్లు, వికారంతో బాధపడ్డారని వర్గాలు తెలిపాయి. దీనిపై స్పందించిన ఎయిరిండియా.. ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని తెలిపింది!
ఈ అనారోగ్య పరిస్థితికి కారణం గురించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని అంటున్నారు. ఈ క్రమంలో... ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల హైపోక్సియాకు దారితీయవచ్చని.. దీంతో, విమానాల్లో వికారం, తలతిరుగుతుందని అంటున్నారు. ఇదే సమయంలో.. ఫుడ్ పాయిజనింగ్ కూడా సంభవించి ఉండొచ్చని చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఎయిరిండియా.. లండన్ హీత్రో నుండి ముంబైకి వెళ్లే ఏఐ-130 విమానంలో ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది విమానంలోని వివిధ దశలలో తల తిరుగుతున్నట్లు, వికారంతో ఇబ్బంది పడినట్లు నివేదించారని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే.. విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయిందని వెల్లడించింది.
దీంతో.. అక్కడ తమ వైద్య బృందాలు తక్షణ వైద్య సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాయని.. ల్యాండింగ్ తర్వాత ఇద్దరు ప్రయాణికులు, ఇద్దరు క్యాబిన్ సిబ్బంది అనారోగ్యంతో బాధపడుతున్నారని.. వారిని తదుపరి పరీక్ష కోసం మెడికల్ రూమ్ కి తీసుకెళ్లి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారని తెలిపింది. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించింది.