అహ్మదాబాద్ ఘటనపై ఎంపీల ప్రశ్నలు.. ఎయిరిండియా సమాధానాలు!
అవును... విమాన ప్రమాదం నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఎయిరిండియా ప్రతినిధులు హాజరయ్యారు.
By: Tupaki Desk | 8 July 2025 10:35 PM ISTఅహ్మదాబాద్ నుంచి జూన్ 12న బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్ లైనర్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందిందని అంటున్నారు! ఈ సమయంలో పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఎయిరిండియా ప్రతినిధులు హాజరయ్యారు.
అవును... విమాన ప్రమాదం నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఎయిరిండియా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రీమ్ లైనర్ విమానాల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఆ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, అధికారిక దర్యాప్తు నివేదిక కోసం తాము కూడా వేచి చూస్తున్నామని చెప్పారు!
ఇదే సమయంలో... ఆ రోజు కుప్పకూలిన 787 డ్రీమ్ లైనర్ మోడల్ సురక్షితమైనదేనని.. ఆ మోడల్ కు చెందినవి వెయ్యికిపైగా విమానాలు నడుస్తున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా... భద్రతా పరమైన విధానాల గురించి ఈ సమావేశంలో ఎంపీలు ప్రశ్నలు వేశారని.. ఇటీవల వెలుగుచూసిన వరుస ఘటనలను ఎత్తిచూపారని.. తక్షణ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు కథనాలొస్తున్నాయి!
ఈ మీటింగ్ కు ఎయిరిండియా సీఈఓ విల్సన్ క్యాంప్ బెల్ తో పాటు పౌరవిమానయాన శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు చెందిన ఉన్నతాధికారులు, ఆకాశ, ఇండిగో సీనియర్ అధికారులు హాజరయ్యారు!
కాగా... 260 మంది మృతి చెందిన ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజు నుంచే అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు! ఈ ప్రమాదంపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ఆధారంగా ఏఏఐబీ ప్రాథమిక నివేదిక రూపొందించింది!
దాన్ని మంగళవారం కేంద్రానికి సమర్పించినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. బ్లాక్ బాక్స్ లోని డేటా, కాక్ పిట్ వాయిస్ రికార్డర్, మేడే కాల్, చివరి నిమిషంలో సిబ్బంది చర్యలు, వాతావరణ పరిస్థితులు మొదలైన అంశాలతో ఈ ప్రాథమిక నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో... ఆ ప్రమాదానికి గల కారణాలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది!