Begin typing your search above and press return to search.

ఎయిరిండియా 'బ్లాక్‌ బాక్స్‌'.. రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు!

జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా దుర్ఘటన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Jun 2025 4:56 PM IST
ఎయిరిండియా బ్లాక్‌  బాక్స్‌.. రామ్మోహన్‌  నాయుడు కీలక వ్యాఖ్యలు!
X

జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా దుర్ఘటన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. మధాహ్నం 1:39 గంటల ప్రాంతంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కు బయలుదేరిన విమాన.. టెకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 274 మంది మృతి చెందారు.

దీంతో... ఈ విమాన ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తును అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచే ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించే ప్రక్రియ మొదలైంది! ఈ సమయంలో ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఈ విమానంలో అసలేం జరిగిందో తెలుసుకోనేందుకు ఇప్పుడు అందరి దృష్టీ 'బ్లాక్‌ బాక్స్‌' విశ్లేషణపై పడింది.

ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందం ఈ బ్లాక్ బాక్స్ ను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నప్పటి నుంచీ దీనిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌ బాక్స్‌ దెబ్బతిందని, అందువల్ల దాన్ని విదేశాలకు పంపించేందుకు సిద్ధమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయని ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో విమానయానశాఖ మంత్రి స్పందించారు.

అవును... ఎయిరిండియా ప్రమాదంలోని బ్లాక్ బాక్స్ దెబ్బతిందని, దాన్ని విదేశాలకు పంపించేందుకు సిధ్హమవుతున్నారని.. ఇందులో భాగంగా.. అమెరికాలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశాలు ఉన్నాయని విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. ఆ ప్రచారాలన్నీ కేవలం ఊహాగానాలేనంటూ కొట్టిపారేశారు.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ సమ్యుక్త ఆధ్వర్యంలో పూణెలో జరిగిన హెలీకాప్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ సమ్మిట్ - 2025 సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు... 'బ్లాక్‌ బాక్స్‌ ను విదేశాలకు పంపిస్తున్నారా?' అనే విలేకరుల ప్రశ్నకు స్పందించారు.

ఇందులో భాగంగా... అవన్నీ కేవలం ఊహాగానాలే అని.. బ్లాక్‌ బాక్స్‌ భారత్‌ లోనే ఉందని.. దీన్ని ప్రస్తుతం ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... 'ఎప్పట్లోగా డేటాను పొందొచ్చు?' అనే మరో ప్రశ్నకు స్పందిస్తూ.. అది చాలా సాంకేతికతతో కూడిన వ్యవహారమని, ఏఏఐబీ దర్యాప్తు చేపట్టి మొత్తం ప్రక్రియను పరిశీలించనివ్వండని అన్నారు.

దీంతో... జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో లభ్యమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు పంపలేదని, భారత్ లోనే ఉందనే విషయం స్పష్టమైంది.