శభాష్ ఏబీఎన్ రాధాక్రిష్ణ...పీ 4 మీద ఎమ్మెల్యేల దందాల మీద కరెక్ట్ గా చెప్పావ్ !
ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఇంత సూటిగా ఘాటుగా హీటెక్కించే రాజకీయ విశ్లేషణ బహుశా ఎవరూ ఇప్పటిదాకా చేసి ఉండలేదేమో.
By: Satya P | 11 Aug 2025 11:53 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఇంత సూటిగా ఘాటుగా హీటెక్కించే రాజకీయ విశ్లేషణ బహుశా ఎవరూ ఇప్పటిదాకా చేసి ఉండలేదేమో. అది కూడా టీడీపీ అనుకూల మీడియా అని ప్రత్యర్థి వర్గం తరచూ ఆరోపిస్తున్న నేపథ్యంలో అదే మీడియా చంద్రబాబు మార్క్ ఐడియాలజీనే ప్రశ్నిస్తోంది. బాబు నాలుగు టెర్ముల ముఖ్యమంత్రిత్వం మీద కూడా నిశిత విమర్శలను ఎక్కు పెడుతోంది. బాబు ఎన్ని సార్లు సీఎం అయినా మారని ఆయన వైఖరిని ఎండగడుతోంది. జనాలు మెచ్చి ఇచ్చిన అధికారం అందుకున్న తరువాత అదే చంద్రబాబు అలవికాని ప్రాజెక్టులను భుజాన కెత్తుకుని పుణ్యకాలం కాస్తా అందులోనే గడిపేస్తూ కోరి ఇబ్బందులలో ఎలా పడుతున్నారో కూడా కళ్ళకు కట్టి చూపింది. ఏబీఎన్ రాధాకృష్ణ అంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు అంటారు. కానీ అదే రాధాకృష్ణ తన సొంత మీడియాలో ప్రతీవారం కొత్త పలుకు పేరుతో రాసే రాజకీయ విశ్లేషణలకు మంచి ఆదరణ ఆసక్తి ఉంటుంది. ఎపుడూ టీడీపీ ప్రత్యర్థుల మీదనే తన అక్షర బాణాలను ఎక్కుపెట్టే రాధాకృష్ణ గత కొంతకాలంగా మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను గట్టిగానే ఎండగడుతున్నారు. అన్నింటికీ మించి చంద్రబాబు బలహీనతలను కూడా బయటపెడుతూ ఆయన పాలనలో లోపాలను ఎత్తి పొడుస్తున్నారు. ఈ వారం ఆయన ఏకంగా పీ 4 పధకం మీద అలాగే ఎమ్మెల్యేల దందాల మీద చేసిన నిశిత విశ్లేషణ కూటమి వర్గాలలో కలకలం రేపుతోంది.
పీ 4 తో ఏమి సాధిస్తారు :
పేదరికం పూర్తిగా నిర్మూలిస్తామని చంద్రబాబు చెబుతూ కొత్తగా తీసుకుని వచ్చిన పీ 4 కాన్సెప్ట్ మీదనే రాధాకృష్ణ తన తీవ్రమైన విమర్శలను ఎక్కుపెట్టారు. ఇది పూర్తిగా ఆచరణ సాధ్యం కాని పధకం అన్నారు. ఈ పధకంలో బంగారు కుటుంబాలు పేరుతో నిరుపేదల ఎంపిక నుంచే అంతా తప్పుల తడకగా సాగింది అని చెప్పారు. ఇప్పటిదాకా ఏపీలో 11 లక్షల మంది బంగారు కుటుంబాలను ఎంపిక చేస్తే ఏకంగా 26 శాతం మంది అందులో అనర్హులుగా ఉన్నట్లు తేలిందని అన్నారు. మరో వైపు చూస్తే మార్గదర్శులను దత్తత పేరుతో బలవంతం చేస్తున్నారు అని ఆరోపించారు. అసలు సేవ చేసేవారికి ఈ బలవంతాలు ఏమిటి అని నిలదీశారు. తీరా బలవంతం పెట్టిన తరువాత వారు చేసే సేవ ఎలా ఉంటుందో తెలియదా అని కూడా నిగ్గదీశారు.
రాజకీయంగా ఇబ్బందులే :
ఏపీలో ఎంతమంది పేదలు ఉన్నారో ప్రభుత్వానికి అయినా ఒక స్పష్టత ఉందా అని కూడా మరో ప్రశ్న సంధించారు. తెల్లకార్డులే పేదరికానికి ప్రమాణం అనుకుంటే కోటికి పైగా కుటుంబాలు పేదరికంలో ఉంటాయని పేర్కొన్నారు. అలాంటపుడు కేవలం 11 లక్షల మందినే పేదలుగా నిర్ణయిస్తే మిగిలిన 89 లక్షల మంది కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఆగ్రహంగా ఉండరా అని నిలదీశారు. అదే విధంగా పేదరికాన్ని నిర్దేశించే ప్రమాణం ఏదీ అని ఆయన అడిగారు. ఏ మాత్రం విధానం లేకుండా బంగారు కుటుంబాల ఎంపిక జరిగిందని అందులో బాగా ఉన్న వారు కూడా పేదల జాబితాలో ఉంటే మార్గదర్శులు కొందరు తమ కంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వారిని పేదరికం నుంచి బయటపడేందుకు సిద్ధపడడం ఏ రకమైన సంకేతాన్ని పంపుతోందని ప్రశ్నించారు. ఎక్కువగా ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధుల సిఫార్సులతోనే బంగారు కుటుంబాల పేదలు నిర్ణయం అయ్యారని కూడా ఆక్షేపించారు. ఉభయ భ్రష్టంగా ఈ పధకం ఉందని కూడా పేర్కొన్నారు.
సంపన్న దేశాలలో పేదరికం లేదా :
పేదరికం లేని సమాజం అన్నది ప్రకృతి విరుద్ధం అయిన విషయంగా చెప్పారు. పేదరికమే నిజంగా నిర్మూలన అయితే సంపన్న దేశాలలోనూ పేదరికం ఉంది కదా అని ఎందుకు ఆలోచించడం లేదని అంటున్నారు. పైగా అక్కడ సైతం సంక్షేమ పధకాలు అమలు అవుతున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇదెక్కడ తద్దినం అని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి సమావేశాలు మార్గదర్శులుగా వారిని ఉండాలని బలవంతం చేయడం వంటి పోకడలను ప్రశ్నించారు. మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో అమలు చేసిన జన్మభూమి పధకానికి పీ 4 కి ఏ మాత్రం సంబంధం లేదని కూడా ఆయన తేల్చేశారు. మార్గదర్శుల ఎంపిక బాధ్యత టీచర్లకు కూడా అప్పగించే స్థాయి దాకా వెళ్ళింది అంటే ఈ పధకం ఏ వైపుగా సాగుతోంది అన్నది ఆలోచించాలని అంటున్నారు. కోరి వ్యతిరేకత తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారా అని కూడా ప్రశ్నించుకోవాలి. ఈ నెల 19న ప్రారంభం అయ్యే పీ 4 ప్రాజెక్ట్ మీద బాబు ఇప్పటికైనా సమీక్షించుకోవాలని అంటున్నారు. ఇక కుటుంబరావు పీ 4 కి పై స్థాయిలో సారధిగా ఉంటూ కలెక్టర్లకు టార్గెట్లు పెడుతున్నారని అన్నారు.
ఎమ్మెల్యేల దందాలు కూడా :
కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు దారుణంగా తయారు అయ్యారు అని కూడా ఈ విశ్లేషణలో విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేల కంటే కూడా అరాచకంగా వ్యవహరిస్తున్నారు అన్న భావన జనంలో బలంగా పెరుగుతోంది. నియోజకవర్గాలలో ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతిని తప్పనిసరి చేశారు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అధికారుల వద్దకు వెళ్ళినా ఎమ్మెల్యేలతో చెప్పించండి అని అంటున్నారు అంటే ఎమ్మెల్యేల జోక్యం ఏ స్థాయిలో ఉందో అని విమర్శించారు. రెవిన్యూ వ్యవహారాల్లో అయితే అది తారస్థాయిలో ఉంది అని అన్నారు. రియలటర్ల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలకు కప్పం కట్టారా అని లబోదిబోమంటున్నారు. పెట్టుబడులు పెట్టేవారికి ఎమ్మెల్యేలు వేధిస్తున్నారని అంటున్నారు. నియోజకవర్గాలకు తామే చక్రవర్తులమని ఎమ్మెల్యేలు కొందరు భావిస్తున్నారు అని కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీని ఆయన కళ్ళకు కట్టేశారు. ఏడాది దాటిన నేపథ్యంలో కూటమి నాయకులు ప్రజాభిప్రాయాన్ని వెంటనే తెలుసుకోవాలని అంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు అని ఆయన కుండ బద్ధలు కొట్టారు.
కొసమెరుపు అంటే ఇదే మరి :
ఇదిలా ఉంటే రాధాక్రిష్ణ కొత్త పలుకు మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన చెప్పేది ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం పనితీరు మీద తన లాంటి వారు విశ్లేషణ చేస్తే వైసీపీకి చెందిన పేటీఎం బ్యాచ్ అని కండువాలు కప్పుతారని అదే రాధక్రిష్ణ లాంటి వారు నిజాలు ఉన్నది ఉన్నట్లు రాస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారని ప్రశ్నించడం విశేషం. ఆయన ఈ సందర్భంగా రాధాకృష్ణ విశ్లేషణను సైతం మెచ్చుకున్నారు కేవలం ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రమే కాదు గతంలో టీడీపీ మీద చంద్రబాబు మీద వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారు అంతా ఇపుడు రాధాక్రిష్ణ ఆర్టికల్ ని వీడియోలు చేస్తూ ఇప్పుడేమంటారు అంటున్నారు. ఇదే కదా అసలైన ట్విస్ట్ అంటే.