ఫ్యాటీ లివర్ కు చెక్ పెట్టండిలా..
ఈ రోజుల్లో బీపీ, షుగర్ లాగానే ఫ్యాటీ లివర్ అనే సమస్య కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దీన్నే హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలుస్తుంటారు.
By: Tupaki Desk | 8 July 2025 12:00 AM ISTఈ రోజుల్లో బీపీ, షుగర్ లాగానే ఫ్యాటీ లివర్ అనే సమస్య కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దీన్నే హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలుస్తుంటారు. మామూలుగా లివర్ లో ఎంతో కొంత కొవ్వు ఉండటం సహజం. కానీ ఆ కొవ్వు మోతాదు కాలేయంలో ఎక్కువగా ఉంటే ఈ సమస్య వస్తుంది. ఫ్యాటీ లివర్ లో కూడా రకాలున్నాయి. ఈ ఫాటీ లివర్ రావడానికి పలు కారణాలున్నాయి.
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, జెనెటిక్స్, తీసుకునే ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ లోపం కారణంగా ఈ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సులు ఎక్కువ. కెమికల్ ఫ్యాక్టరీల్లో వర్క్ చేసే వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఈ ఫ్యాటీ లివర్ ను నిర్లక్ష్యం చేస్తే ఫైబ్రోసిస్, సిర్రోసిస్, క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.
ఈ సమస్యను అధిగమించడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం కచ్ఛితంగా ఉందంటున్నారు. కేవలం ఆహారం మాత్రమే సమస్యను పూర్తిగా నయం చేయకపోయినా ఈ మార్పు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని, కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యను అడ్డుకోవచ్చని పరిశోధనలు చేసి సైంటిస్టులు చెప్తున్నారు.
పెరుగు, డార్క్ చాక్లెట్స్, దాల్చిన చెక్క, వాల్‌నట్స్, ఆపిల్ లాంటి వాటిని విడివిడిగా కాకుండా కాంబినేషన్స్ తో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయంటున్నారు. వారానికి రెండు సార్లైనా గుప్పెడు వాల్‌నట్స్, రెండు ఖర్జూరాలను కలిపి తీసుకుంటే లివర్ ఇన్‌ఫెక్షన్లను అడ్డుకోవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. డ్రైనట్స్ తో డార్క్ చాక్లెట్ ను తిన్నా మంచి ఫలితాలుంటాయని, ఆపిల్- దాల్చినచెక్క పొడి- తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి. వీటిని తీసుకుంటూ చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.