భారత్ ను కమ్మేస్తోన్న మరో మహమ్మారి
ఈ జీర్ణవ్యవస్థ క్యాన్సర్లలో మూడింట రెండు వంతుల కేసులు ఆసియా ఖండంలోనే నమోదు కానున్నాయని పరిశోధనల్లో తేలింది.
By: Tupaki Desk | 8 July 2025 12:00 PM ISTప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న క్యాన్సర్ రోగాలలో ఇప్పుడు జీర్ణ వ్యవస్థకు (Gastrointestinal System) సంబంధించిన క్యాన్సర్లు పెద్దమొత్తంలో పెరుగుతున్నట్లు తాజా గ్లోబల్ అధ్యయనం తీవ్రంగా హెచ్చరిస్తోంది. 2008 నుండి 2017 మధ్య జన్మించిన ప్రపంచ వ్యాప్తంగా 1.5 కోట్ల మందికి పైగా వారి జీవితకాలంలో జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ బారినపడే ప్రమాదముందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలు, వైద్యరంగం, సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే హితవు కూడా.
ఆసియా కేంద్రంగా పెరుగుతున్న కేసులు
ఈ జీర్ణవ్యవస్థ క్యాన్సర్లలో మూడింట రెండు వంతుల కేసులు ఆసియా ఖండంలోనే నమోదు కానున్నాయని పరిశోధనల్లో తేలింది. ఇందులో ముఖ్యంగా భారత్, చైనా దేశాలు అత్యధికంగా ప్రభావితమవుతాయని, వీటిలో 65 లక్షల కేసులు ఈ రెండు దేశాల్లోనే సంభవిస్తాయని అంచనా వేయబడింది. ఆసియాలో మొత్తం 1.06 కోట్ల వరకు జీర్ణవ్యవస్థ క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపించనుందని, కానీ ప్రధానంగా ఆసియాలోనే ముప్పు ఎక్కువగా ఉందని వివరించారు. ఈ అధ్యయనం 185 దేశాల్లో 2008-2017 మధ్య జన్మించిన ప్రజల్లో జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ల ప్రబలతను పరిశీలించి, ప్రపంచవ్యాప్తంగా 1.56 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.
-ముందస్తు నిర్ధారణతో 75% కేసుల నివారణ సాధ్యమే!
ఈ నివేదిక ఆందోళన కలిగించినప్పటికీ ఒక ఆశాజనకమైన విషయాన్ని కూడా తెలియజేస్తోంది. చికిత్సలు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్యాన్సర్లలో 75 శాతం వరకు నివారించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతకుముందే వ్యాధిని గుర్తించి చికిత్సలు చేపడితే, జీర్ణవ్యవస్థ క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని వారు సూచిస్తున్నారు. దీనికి సమయానికి స్క్రీనింగ్, హెల్త్ చెకప్‌లు, ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం కీలకం.
-ఆరోగ్యమే మహాభాగ్యం: తక్షణ చర్యలు అవసరం
ఆరోగ్యమే మహాభాగ్యం. కడుపునొప్పి, అజీర్తి, బలహీనత వంటి చిన్న లక్షణాలనైనా అలసత్వంగా తీసుకోకుండా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధి నివారణే మేలైన చికిత్స. ఈ పెను ముప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వాలు ప్రజారోగ్య కార్యక్రమాలను విస్తృతం చేయాలి, ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. జీర్ణవ్యవస్థ క్యాన్సర్ల పట్ల అవగాహన పెంచుకొని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ పెను ఉపద్రవం నుండి బయటపడవచ్చు.