ప్రపంచంలో టాప్ 100 ఉత్తమ ఆహార నగరాల్లో హైదరాబాద్ కు చోటు
హైదరాబాద్ మహానగరం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోని టాప్ 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో హైదరాబాద్ కు చోటు దక్కింది.
By: Tupaki Desk | 7 July 2025 4:00 PM ISTహైదరాబాద్ మహానగరం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోని టాప్ 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో హైదరాబాద్ కు చోటు దక్కింది. టేస్ట్ అట్లాస్ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ వంద నగరాల జాబితాను ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ మహానగరం టాప్ 50వ స్థానాన్ని సొంతం చేసుుకోవటం విశేషం.
స్థానిక ఆహారం మాత్రమే కాదు.. దేశీయ ఆహార ప్రియులకే కాదు.. అంతర్జాతీయ ఆహార ప్రియుల అవసరాల్ని తీర్చటం.. వారి మనసుల్ని దోచుకోవటంలో హైదరాబాద్ మరోసారి తానేమిటో రుజువు చేసుకుందని చెప్పాలి. నగర చరిత్ర.. భౌగోళిక స్థితిని ప్రతిబింబించేలా ఇక్కడ ఆహారం ఉండటం ఒక ప్రత్యేకత. సందర్భం ఏదైనా రుచులతో ముడిపడిన అనుబంధాల నగరంగా హైదరాబాద్ కు పేరుంది.
ప్రాంతాలకు అతీతంగా అందరూ ఇష్టపడే హైదరాబాద్ బిర్యానీ మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతాల సంప్రదాయ రుచులు(కోస్తా.. రాయలసీమ.. తెలంగాణ.. ఉత్తరాంధ్ర) వీటికి తోడుగా ఉత్తరాది ఘుమఘుమలు.. ఇరానీ.. అరబ్బు.. మొఘల్.. పర్షియన్. టర్కిష్ రుచులు మాత్రమే కాదు.. ఇటాలియన్.. కాంటినెంటల్.. అమెరికా.. మెక్సికన్.. చైనీస్ వంటకాలు నగరం మొత్తాన్ని ఘుమఘుమలాడిస్తూ ఉంటాయి.
వీటికి తోడు హలీమ్.. ఇరానీ చాయ్.. ఉస్మానియా బిసెట్.. డబుల్ కా మిఠా ఇలా చెబుతూ పోతే.. వైవిధ్యభరితమైన ఆహార జాబితా భారీగానే ఉంటుంది. ఈ కారణంగా హైదరాబాద్ మహానగరం ఫుడ్ ప్యారడైజ్ గా అభవర్ణిస్తారు. దేశం ఏదైనా.. రుచి మరేదైనా.. అందరికి అందుబాటులో ఉండే రుచులు.. వారి మనసుల్ని దోచేలా ఉండటమే కాదు.. అందుబాటు ధరల్లో ఉండటం మరో ప్రత్యేకతగా చెప్పాలి. ఏమైనా గ్లోబల్ జాబితాలో హైదరాబాద్ టాప్ 50లో నిలవటం తెలుగు వారందరికి గర్వకారణమే.