'సయ్యార' కోసం అయినా వార్ ఆపొచ్చుగా...!
హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన 'వార్ 2' సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 10 Aug 2025 1:00 AM ISTహృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన 'వార్ 2' సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న వార్ 2 సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో సౌత్ ఇండియాలోనూ వార్ 2 కి భారీ హైప్ క్రియేట్ అయింది. వార్ 2 సినిమా ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్‌ను నమోదు చేయడం ఖాయం. పోటీగా కూలీ సినిమా ఉన్నప్పటికీ వార్ 2 కి ఉన్న స్టార్ కాస్ట్, బజ్ నేపథ్యంలో వందల కోట్ల ఓపెనింగ్స్‌ను మేకర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే భారీ రిలీజ్‌ను ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది.
కూలీ వర్సెస్ వార్ 2
వార్ 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యాయి. అయినా కూడా ఆగస్టులోనే సినిమాను విడుదల చేయాలి అనే పట్టుదలతో దర్శకుడు అయాన్ ముఖర్జీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను స్పీడ్‌గా చేయించినట్లు సమాచారం. కూలీ సినిమా కోసం వార్ 2 సినిమా వాయిదా వేయాలని చాలా మంది కోరారు. సోషల్ మీడియా ద్వారానే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా చాలా మంది వార్ 2 ను వాయిదా వేయవచ్చుగా అంటూ విజ్ఞప్తి చేశారు. కానీ యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు వార్ ను వాయిదా వేసే ప్రసక్తే లేదని అన్నారు. కానీ ఇప్పుడు వారే వార్ 2 ను ఆగస్టు 14న విడుదల చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నడుస్తున్న తమ సినిమాకు వార్ 2 వల్ల డ్యామేజీ అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సయ్యార బాక్సాఫీస్ రిపోర్ట్
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి వచ్చిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'సయ్యార' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తున్న విషయం తెల్సిందే. సయ్యార విడుదలైన నాలుగు వారాల తర్వాత వార్ 2 ను విడుదల చేయాలని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ వారు ముందస్తు ప్లాన్ చేసుకున్నారు. సయ్యార సినిమా విషయంలో పెద్దగా నమ్మకం లేకుండానే మేకర్స్ విడుదల చేశారు. కానీ ఇప్పుడు సయ్యార సినిమా థియేటర్ లో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది. ఇప్పటి వరకు దాదాపుగా రూ.500 కోట్ల వసూళ్లను ఈ సినిమా రాబట్టినట్లు తెలుస్తోంది. మరో మూడు నాలుగు వారాల పాటు సయ్యార బాక్సాఫీస్ రన్ కి ఛాన్స్ ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వార్ 2 రాబోతున్న నేపథ్యంలో సయ్యార సినిమాను తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది.
సయ్యార తొలగించాల్సిందే
వార్ 2 సినిమా విడుదల తేదీ విషయంలో చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నారు. అయితే సయ్యార సినిమా ఎంత చేసినా కేవలం రెండు మూడు వారాల కంటే ఎక్కువగా థియేటర్‌లో ఉండటం సాధ్యం కాదని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ వారు అనుకుని ఉంటారు. అందుకే సయ్యార విడుదలైన సరిగ్గా నాలుగు వారాల తర్వాత వార్ 2 విడుదల ఉండే విధంగా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడేమో సయ్యార కి నాలుగు వారాల సమయం సరిపోవడం లేదు. ఇతర భాషల్లో సినిమాను చూస్తూనే ఉన్నారు. అంతే కాకుండా హిందీ వర్షన్ సైతం మరో రెండు మూడు వారాలు అయినా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో వార్ 2 రావడం వల్ల మంచి వసూళ్లు వస్తున్న థియేటర్ నుంచి సయ్యార సినిమాను తొలగించాల్సి ఉంటుంది. అందుకే సయ్యార సినిమా కోసం అయినా వార్ 2 సినిమా విడుదల వాయిదా వేయచ్చు కదా అని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కనుక వార్ 2 సినిమా వాయిదా పడే అవకాశం లేనే లేదు.