అతడిపై అంచనాలు సంచలనాలయ్యేనా?
అనిరుద్ సంగీతం అందించిన 'ఇండియన్-2', 'వెట్టయాన్', 'విదాముయార్చి' సినిమాలు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి.
By: Tupaki Desk | 24 Jun 2025 9:06 PM IST'కూలీ'- 'వార్2' బాక్సాఫీస్ వార్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. రెండు చిత్రాలు ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ 'వార్' టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కీలకంగా మారే అవకాశం ఉంది. రజనీ కాంత్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. పైగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. అలాగే 'వార్ 2' లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.
హృతిక్ రోషన్ హీరో కాగా, తారక్ విలన్ పాత్రలో అలరించనున్నారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల పోరు గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతానికి 'వార్- 2' కంటే బజ్ ఎక్కుగా కూలీ కే ఉంది. ఆ ఊపును కొనసాగిం చాలంటే బుధవారం రిలీజ్ అయ్యే తొలి లిరికల్ సాంగ్ కూడా అంతే కీలకం. జూన్ 25న సాయంత్రం 6 గంటలకు తొలి సాంగ్ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే 'కూలీ' విషయంలో ఇక్కడో బ్యాడ్ సెంటిమెంట్ కూడా తెరపైకి వస్తోంది. అనిరుద్ సంగీతం అందించిన 'ఇండియన్-2', 'వెట్టయాన్', 'విదాముయార్చి' సినిమాలు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. అనిరుద్ కూడా ఓల్డ్ అవుతున్నాడనే విమర్శ వ్యక్తమవుతుంది. 'జన నాయగన్' ప్రచార చిత్రాల ఆర్ ఆర్ లోనూ పెద్దగా పనితనం కనిపించలేదు. దీంతో ఆ విమర్శలన్నింటిని బుధవారం రిలీజ్ అయ్యే కూలీ సాంగ్ తిప్పి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాంగ్ హిట్ అయితే అనిరుద్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయినట్లే. దీంతో ఆ సాంగ్ ఎలా ఉంటుంది? అన్న అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అనిరుద్ చాలా సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. తమిళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ సినిమాలకు పనిచేస్తున్నాడు. మరి ఇంత బిజీలో 'కూలీ' కోసం ఎలాంటి ఔట్ పుట్ ఇచ్చాడో చూడాలి.