వార్ 2లో అవే హైలెట్.. పూనకాలు గ్యారెంటీ!
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తొలిసారి హిందీలో నటిస్తున్న చిత్రం వార్ 2.
By: Madhu Reddy | 12 Aug 2025 11:48 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తొలిసారి హిందీలో నటిస్తున్న చిత్రం వార్ 2. ఇందులో తొలిసారి విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ ఉండగా.. కియారా అద్వానీ ఆయనకు జోడిగా ఎంపికయింది. ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వార్ మూవీకి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన అటు రజనీకాంత్ 'కూలీ' సినిమాకి పోటీగా విడుదల కాబోతోంది.
ఇకపోతే కూలీ సినిమాతో పోల్చుకుంటే.. వార్ 2 చిత్రానికి పెద్దగా హైప్ లేకపోయినా.. ఇప్పుడు ఆ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాపై వస్తున్న వార్తలు అభిమానులను సంతోషపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నప్పటికీ ఆయన పాత్ర సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాల తర్వాత ఉంటుంది అని కామెంట్లు చేసి అభిమానులను హర్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సౌత్ ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ సినిమాకు సంబంధించిన హైలెట్స్ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వార్ 2 హైలెట్స్ విషయానికి వస్తే.. సినిమా స్టార్ట్ అయిన 18వ నిమిషంలోనే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందట. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ కి వచ్చేసరికి ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేస్తాయని.. పూనకాలు రావడం గ్యారెంటీ అని సమాచారం. పైగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని , క్లైమాక్స్ అదిరిపోయింది అని సమాచారం. మొత్తానికైతే వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ ను తొక్కేస్తారేమో అని బాధపడ్డ అభిమానులకు ఇది మరింత కిక్ ఇచ్చే అంశమని చెప్పవచ్చు. వార్ 2 చిత్రానికి సంబంధించిన హైలెట్స్ ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.
దీనికి తోడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ప్రధాన కారణంగా నిలిచింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా హృతిక్ రోషన్ తెలుగు ఆడియన్స్ ను ఆకాశానికి ఎత్తేయడం.. తారక్ తనకు తమ్ముడి లాంటి వాడు అని, తారక్ తో మళ్ళీ సినిమా చేయకపోయినా ఆయన చేసే బిర్యాని తింటూ జీవితం గడిపేస్తానని చెప్పడం కూడా అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. పైగా వీరిద్దరూ కూడా ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అనే విషయాలను కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు. మరి ఫస్ట్ రివ్యూ అంటూ హైప్ పెంచేసిన చిత్ర బృందం ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.