వెంకీ 365 రోజులు.. 4 సినిమాలు
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్, రీసెంట్ గానే రానా నాయుడు వెబ్‌సిరీస్ సీజన్2తో ప్రేక్షకులను పలకరించాడు.
By: Tupaki Desk | 24 Jun 2025 10:51 AM ISTసంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్, రీసెంట్ గానే రానా నాయుడు వెబ్‌సిరీస్ సీజన్2తో ప్రేక్షకులను పలకరించాడు. మొదటి సీజన్ తో వెంకీ ఇమేజ్ కు జరిగిన డ్యామేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్ ను మరింత జాగ్రత్తగా తెరకెక్కించారు. రానా నాయుడు2 తో ఆడియన్స్ ను అలరించిన వెంకీ ఇప్పుడు యంగ్ హీరోలకు పోటీగా సినిమాలను లైన్ లో పెట్టాడు.
ప్రస్తుతం వెంకీ చేతిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అయితే వెంకీ చేతిలో ఉన్న ఈ నాలుగు సినిమాలు సంవత్సరం కాలంలో రానుండటం విశేషం. వాటిలో ముందుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మెగా157 రానుంది. 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాలో వెంకటేష్ క్యామియో చేయనున్నాడని తెలిసిందే. ఈ మూవీ కోసం వెంకీ ఏకంగా మూడు నుంచి నాలుగు వారాల కాల్షీట్స్ కూడా ఇచ్చాడని సమాచారం.
మెగా157 తర్వాత అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్- వెంకటేష్ కలయికలో రూపొందే సినిమా రిలీజ్ కానుంది. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2026 సమ్మర్ లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన త్రివిక్రమ్, డైరెక్టర్ గా మారాక వెంకీతో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదని అందరూ భావించగా, ఇన్నాళ్లకి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రానుండటంతో ఈ మూవీపై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
దీంతో పాటూ వెంకటేష్ దృశ్యం ఫ్రాంచైజ్ లో భాగంగా రానున్న దృశ్యం3ను కూడా నెక్ట్స్ ఇయర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడని తెలుస్తోంది. దృశ్యం, దృశ్యం2 ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో తెరకెక్కగా, ఆ సినిమాలను వెంకీ తెలుగులో రీమేక్ చేశాడు. ఇప్పుడు మలయాళంలో దృశ్యం3 తెరకెక్కుతుంది. అదే సినిమాను వెంకీ తెలుగులో చేయనుండగా, దృశ్యం3 నెక్ట్స్ ఇయర్ అక్టోబర్ లో రిలీజయ్యే అవకాశముంది.
ఆ తర్వాత 2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ మరో సినిమా చేయబోతున్నాడు. మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. మెగా157 తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే సినిమా వెంకటేష్ తోనే అని తెలుస్తోంది. మొత్తానికి విక్టరీ వెంకటేష్ 365 రోజుల్లో నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడన్న మాట. వెంకీ స్పీడ్ చూసి ఇప్పుడు యంగ్ హీరోలు కూడా షాకవుతున్నారు.