Begin typing your search above and press return to search.

ఫ్లాప్ డైరెక్టర్ తో వరుణ్.. ఈసారి రిస్కు లేని కథ!

వరుణ్ ఈసారి సినిమాల ఎంపికలో స్పష్టమైన మార్పు చూపించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   29 April 2025 11:15 PM IST
ఫ్లాప్ డైరెక్టర్ తో వరుణ్.. ఈసారి రిస్కు లేని కథ!
X

మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం కాస్త సంక్లిష్టంగా సాగుతోంది. గత మూడు సినిమాలు గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా అన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. ఒకదానికొకటి భిన్నమైన యాక్షన్ నేపథ్యాలతో వచ్చినా, ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. వరుణ్ తన ప్రయోగాల వల్ల కాస్త తడబడినట్లే కనిపించాడు. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, బిజినెస్ సేఫ్ గా ఉండే కథలకే మొగ్గు చూపిస్తున్నాడు.

లేటెస్ట్ టాక్ ప్రకారం, వరుణ్ తేజ్ తన కొత్త సినిమా కోసం 'రాధేశ్యామ్', 'జిల్' సినిమాల దర్శకుడు రాధాకృష్ణతో చేతులు కలిపనున్నట్లు తెలుస్తోంది. రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయినప్పటికీ, ఆ సినిమా లవ్ స్టోరీ ట్రీట్‌మెంట్ విషయంలో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు అదే నమ్మకంతో వరుణ్, రాధాకృష్ణ చెప్పిన క్లాసికల్ లవ్ స్టోరీ లైన్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి బ్యానర్ వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. ప్రస్తుతం వరుణ్ 'కొరియన్ కనకరాజు' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా కొనసాగుతోంది. ఆచార్య సెట్లో ఒక ఐటెం సాంగ్‌ను చిత్రీకరిస్తుండగా, ప్రస్తుత షెడ్యూల్ పూర్తయిన తర్వాత రాధాకృష్ణ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

వరుణ్ ఈసారి సినిమాల ఎంపికలో స్పష్టమైన మార్పు చూపించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ గత సినిమాలపై ఒక విశ్లేషణ చేసుకుంటే, సీరియస్ డ్రామాలు లేదా యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథలు అతనికి కలిసి రాలేదని స్పష్టంగా తెలుస్తోంది. మాస్ కమర్షియల్ ట్రెండ్‌ను అందిపుచ్చుకోవడానికి చేసిన ప్రయోగాలు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే రొమాంటిక్ కథలతో మళ్ళీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడట. అందుకే రాధాకృష్ణ స్టైల్‌లో పక్కా లవ్ స్టోరీని ఎంచుకున్నాడు.

'తొలిప్రేమ' వంటి రొమాంటిక్ డ్రామాతో వరుణ్ తేజ్ తన కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను తిరిగి రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఈసారి కథ, నేరేషన్, స్క్రీన్‌ప్లే విషయంలో ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్ గేమ్ ఆడాలని వరుణ్ ప్లాన్ చేసుకున్నాడు. గత ఫ్లాప్స్‌తో వచ్చిన ఒత్తిడిని తుడిచేసేందుకు ఈ లవ్ స్టోరీ చక్కటి ఛాన్స్ అవుతుందని అనుకోవచ్చు.