ఉపాసన 'సాయిబాబా వ్రతం'.. అందరూ ఆహ్వానితులే!
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 8 July 2025 1:36 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ గా ఉన్న ఆమె.. అత్తమ్మాస్ కిచెన్ ను కూడా నడుపుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. వివిధ రకాల పోస్టులు పెడుతున్నారు.
ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటారు. తన అత్తమ్మాస్ కిచెన్ రివ్యూస్ ను పోస్ట్ చేస్తూంటారు. తాజాగా సాయిబాబాపై తనకున్న లోతైన విశ్వాసాన్ని పంచుకున్నారు. తాను గురు పూర్ణిమ నాడు నవ గురువార సాయిబాబా వ్రతాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేవునితో అనుసంధానం కావడానికి అదొక మార్గమన్నారు.
తొమ్మిది వారాల ఆధ్యాత్మికత, ఆనందం కోసం అందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఉపాసన. ఆ సమయంలో వీడియోలో సాయిబాబాపై ఉన్న తన నమ్మకాన్ని, అనుభవాలను పంచుకున్నారు. తన భర్తకు అయ్యప్ప ఇష్టమని, తనకు సాయిబాబా అని తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ ను గమనిస్తున్నానన్నారు.
వారంతా దేవుడిపై విశ్వాసం చూపించారని తెలిపారు. తన జీవితంలో ఓసారి క్లిష్ట పరిస్థితుల్లో చాలా భయపడినట్లు తెలిపిన ఉపాసన.. అప్పుడు సాయిబాబా వ్రతం గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. కథను చదివానని, చాలా పాజిటివ్ గా అనిపించిందని, చుట్టూ ఉన్న మనుషులు కూడా పాజిటివ్ మైండ్ తో కనిపించారని పేర్కొన్నారు.
అందుకే ఆ వ్రతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తెలిపిన ఉపాసన.. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఓసారి వ్రతాన్ని మొదలుపెట్టాలని సూచించారు. మనం పెట్టుకున్న విశ్వాసం మనల్ని కాపాడుతుందని చెప్పారు. తాను చేయబోయే తొమ్మిది వారాల సాయిబాబా వ్రతంలో అంతా పాల్గొనాలని కోరారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
అయితే ఉపాసన పోస్ట్ చూపించిన వీడియోలో ఆమె ఆలయానికి వెళ్లిన విజువల్స్ యాడ్ చేశారు. అందులో ఎంతో భక్తితో ఆమె కనిపించారు. దేవుడి గది కూడా చూపించగా.. అందులో సాయిబాబా విగ్రహం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పటికే ఉపాసన పలుమార్లు సాయిబాబా వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం తొమ్మిది వారాల గ్లింప్స్ ను పోస్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి చేస్తున్నట్లు వెల్లడించారు.