మహేష్ బాబు మాదిరిగా నా వల్ల కాదు : త్రిష
అంతాల తార త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటి పోయింది. ఈమెతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్స్ చాలా మంది కనీసం కనిపించడం లేదు.
By: Tupaki Desk | 24 Jun 2025 4:23 PM ISTఅంతాల తార త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటి పోయింది. ఈమెతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్స్ చాలా మంది కనీసం కనిపించడం లేదు. చాలా మంది సినిమా ఇండస్ట్రీకి దశాబ్ద కాలం క్రితమే దూరం అయ్యి పర్సనల్ లైఫ్‌తో బిజీగా ఉన్నారు. కానీ త్రిష మాత్రం ఇండస్ట్రీలో ఇప్పటికీ బిజీగా ఉంది. హీరోయిన్‌గా త్రిషకు దక్కిన హిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఈ అమ్మడు దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఎంతో మంది హీరోలతో సినిమాలు చేయడం ద్వారా అత్యధికంగా హీరోలతో సినిమాలు చేసిన ఈతరం హీరోయిన్‌గా నిలిచే అవకాశాలు లేకపోలేదు.
త్రిష ఇటీవల యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్‌తో కలిసి నటించిన థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచినప్పటికీ ఆ సినిమాలో త్రిష పాత్ర గురించి చెప్పుకునే విధంగా ఉంది. ఆ సినిమా మరిన్ని పాత్రలను, సినిమాలను తీసుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలో చిరంజీవితో కలిసి నటించిన విశ్వంభర సినిమాతో త్రిష ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా వరుస సినిమాలు చేస్తున్న త్రిష ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కోస్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో చాలా మంది మహేష్ బాబు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు గొప్పతనం గురించి చెప్పడం జరిగింది.
తాజాగా హీరోయిన్ త్రిష ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ... అతడు సినిమాతో పాటు సైనికుడు సినిమాల్లో మహేష్ బాబు గారితో కలిసి నటించే అవకాశం దక్కింది. ఆయనతో వర్క్ చేస్తున్న సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. సెట్స్‌కు ఉదయాన్నే 6 గంటలకు రావడం ఆయనకు అలవాటు, రాత్రి వరకు ఆయన సెట్స్‌లోనే ఉండేవారు. ఉదయం నుంచి రాత్రి వరకు అదే ఉత్సాహంతో ఆయన షూటింగ్‌లో పాల్గొనేవారు. తన షాట్స్ ఉన్నా లేకున్నా మానిటర్ ముందు కూర్చుని ఉండేవారు. ఇతర నటీ నటుల నటన పరిశీలిస్తూ ఉండేవారు. ఆయన తన సీన్ వచ్చినప్పుడు వచ్చి కూర్చుందాం అనుకునేరకం కాదు.
మహేష్ బాబు సెట్స్‌లో ఉన్న విధంగా నేను ఎప్పుడూ ఉండలేక పోయాను. ఆయన మాదిరిగా అంత ఉదయమే వచ్చే అవకాశం నాకు ఉండేది కాదు. నేను ఎంత ప్రయత్నించినా ఆయన కంటే ముందు రాలేకపోయేదాన్ని అంటూ త్రిష చెప్పుకొచ్చింది. ప్రతి సీన్‌ను చాలా శ్రద్దగా వింటూ ఉండేవారు, అంతే కాకుండా షూటింగ్ తర్వాత కూడా మానిటర్‌లో చాలా శ్రద్దగా ఆ సీన్స్‌ను చూసుకుని, తనను తాను జడ్జ్ చేసే వాడని త్రిష పేర్కొంది. ప్రస్తుతం మహేష్ బాబు మిస్టర్ పర్‌ఫెక్ట్ అయిన జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. 2026 లో వీరి కాంబో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సాధ్యం కాకుంటే 2027 లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.