Begin typing your search above and press return to search.

ల‌క్ష టికెట్ల‌తో 'మిష‌న్ ఇంపాజిబుల్' బెస్ట్ ఓపెనింగ్స్‌

తాజా బాక్సాఫీస్ లెక్క‌ల‌ ప్ర‌కారం.. ది ఫైనల్ రెకనింగ్ భారతదేశంలో ప్రారంభ రోజున రూ. 15 కోట్ల మార్కును అధిగమించి డెడ్ రిక‌నింగ్ మొద‌టి భాగం వ‌సూళ్ల‌ను అధిగ‌మించింది.

By:  Tupaki Desk   |   16 May 2025 6:26 PM IST
ల‌క్ష టికెట్ల‌తో మిష‌న్ ఇంపాజిబుల్ బెస్ట్ ఓపెనింగ్స్‌
X

టామ్ క్రూజ్ న‌టించిన 'మిష‌న్ ఇంపాజిబుల్- ది ఫైన‌ల్ రిక‌నింగ్' ఇండియాలో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగులు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఇంకా ముంద‌స్తు బుకింగులు ఓపెన్ కాక ముందు, కేవ‌లం 12 గంటల్లోనే టాప్ నేషనల్ మ‌ల్టీప్లెక్స్ చైన్లలో 1,00,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇది సిరీస్ లో ఎనిమిదో సినిమా కాగా, మునుప‌టి చిత్రానికి సీక్వెల్ గా తెర‌కెక్కింది.

తాజా బాక్సాఫీస్ లెక్క‌ల‌ ప్ర‌కారం.. ది ఫైనల్ రెకనింగ్ భారతదేశంలో ప్రారంభ రోజున రూ. 15 కోట్ల మార్కును అధిగమించి డెడ్ రిక‌నింగ్ మొద‌టి భాగం వ‌సూళ్ల‌ను అధిగ‌మించింది. 2023లో రూ. 12.25 కోట్ల ఓపెనింగుల‌తో పార్ట్ 1 విడుద‌ల కాగా, పార్ట్ 2 ఆ రికార్డును చెరిపేసింది. ఈ శ‌నివారం నాడు బుకింగుల్లో మ‌రింత హుషారు క‌నిపిస్తుంద‌ని అంచ‌నా.

క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించిన 'ది ఫైనల్ రికనింగ్' గ‌త ఏడాది వ‌చ్చిన 'డెడ్ రికనింగ్‌'కు సీక్వెల్‌. 2 గంటల 49 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్న చిత్ర‌మిది. సీబీఎఫ్‌సి నుండి U/A సర్టిఫికేషన్ పొందింది. స‌మ్మెలు గొడ‌వ‌ల‌తో నిర్మాణం ప‌రంగా ఆల‌స్యాల్ని ఎదుర్కొన్న చిత్ర‌బృందం 2024 చివరి నాటికి చిత్రీకరణను పూర్తి చేసి మే 5న టోక్యోలో ప్రీమియ‌ర్ ని ప్ర‌ద‌ర్శించింది. మే 14న జరిగిన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోను ప్ర‌ద‌ర్శించారు.

అక్కడ దీనికి 5 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ చిత్రాన్ని భారతదేశంలో వయాకామ్ 18 పంపిణీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 3,000 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో విడుదల చేస్తున్నారు. టైర్-2 , టైర్-3 మార్కెట్‌లలో హిందీ-డబ్బింగ్ షోలపై దృష్టి సారించి, ఇంగ్లీష్ వెర్షన్‌తో టైర్-వన్ నగరాల్లోని మల్టీప్లెక్స్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రిలీజ్ చేయ‌స్తున్నార‌ని స‌మాచారం. భార‌త‌ దేశంలో డెడ్ రెకనింగ్ మొద‌టి భాగం జీవితకాల వసూళ్లు రూ. 106 కోట్లు కాగా ఈ రికార్డును పార్ట్ 2 బ్రేక్ చేస్తుంద‌ని అంచ‌నా.