Begin typing your search above and press return to search.

సినిమా చేయ‌క‌పోతే వ‌డ్డీతో స‌హా వ‌సూల్!

హీరోల‌కు నిర్మాత‌లు అడ్వాన్సులు చెల్లించ‌డం స‌హ‌జం. ఇద్ద‌రు క‌లిసి సినిమా చేద్దాం? అన్న ఆలోచ‌న‌తో ఇద్ద‌రి మ‌ధ్య ఒప్పందం జ‌రుగుతుంది.

By:  Srikanth Kontham   |   14 Aug 2025 12:00 AM IST
సినిమా చేయ‌క‌పోతే వ‌డ్డీతో స‌హా వ‌సూల్!
X

హీరోల‌కు నిర్మాత‌లు అడ్వాన్సులు చెల్లించ‌డం స‌హ‌జం. ఇద్ద‌రు క‌లిసి సినిమా చేద్దాం? అన్న ఆలోచ‌న‌తో ఇద్ద‌రి మ‌ధ్య ఒప్పందం జ‌రుగుతుంది. కొన్నిసార్లు ఒప్పందం ప్ర‌కారం సినిమాలు చేస్తుంటారు. మ‌రికొ న్నిసార్లు అది సాధ్య‌ప‌డ‌క‌పోవ‌చ్చు. అందుకు కార‌ణాలు అనేకం. అయితే ఇక్క‌డ అడ్వాన్స్ చెల్లించ‌డం విష‌యంలో ఓ నిర్మాత రెండు ర‌కాల ప‌ద్ద‌తులు అవ‌లంబిస్తాడు? అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. హీరో త‌న‌కు తానుగా వ‌చ్చి నిర్మాత‌ను అడ్వాన్స్ అడిగి తీసుకోవడం ఒక పద్ద‌తైతే? నిర్మాతే హీరో వ‌ద్ద‌కు వెళ్లి అడ్వాన్స్ ఇవ్వ‌డం మ‌రో ప‌ద్ద‌తి అన్న‌ది నిర్మాత మాట‌ల్లో హైలైట్ అయింది.

ఆ నిర్మాత ప‌ద్ద‌తే వేరు:

ఒక‌వేళ ఆ హీరో అనివార్య కార‌ణాల‌తో అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయ‌క‌పోతే గ‌నుక అడ్వాన్స్ తో పాటు ఆ డ‌బ్బుకు వ‌డ్డీ కూడా వ‌సూల్ చేస్తాడా నిర్మాత‌. అదే తాను హీరో వ‌ద్ద‌కు వెళ్లి అడ్వాన్స్ ఇస్తే మాత్రం తిరిగి ఇచ్చేసే క్ర‌మంలో ఎలాంటి వ‌డ్డీ లేకుండా కేవ‌లం అడ్వాన్స్ మాత్ర‌మే తిరిగి తీసుకుంటాడుట‌. ఇది త‌న ప‌ద్ద‌త‌ని తెలిపాడు. ఊర‌క‌నే డ‌బ్బు తీసుకుని సినిమా చేయ‌కుండా పోతే త‌న‌కు వ‌డ్డీ లాస్ క‌దా? అన్న కార‌ణాన్ని తెర‌పైకి తెచ్చాడు. ఏ హీరో వ‌ద్దైనా త‌న స్టైల్ ఇలాగే ఉంటుంద‌న్నాడు. త‌న‌కు తానుగా అడ్వాన్స్ ఇస్తే త‌ప్ప‌! వెన‌క్కి త‌గ్గే టైపు కాద‌న్నాడు.

నిర్మాత‌ల డ‌బుల్ గేమ్:

నిజంగా నిర్మాత‌లంతా ఈయ‌న‌లా ఉంటే ? హీరోలంతా ఇచ్చిన మాట ప్ర‌కారం క‌ట్టుబ‌డి ప‌ని చేస్తారు. ముందు తీసుకున్న అడ్వాన్స్ కు సినిమా చేస్తారు. అది పూర్త‌య్యే వ‌ర‌కూ మరో సినిమాకు అడ్వాన్స్ తీసుకోరు. తీసుకుని చేయ‌క‌పోతే వ‌డ్డీ కూడా క‌ట్టాలి అనే భ‌యం ఉటుంది కాబ‌ట్టి! ఓ ఆర్డ‌ర్ ప్రకారం సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. అయితే ఇక్క‌డ నిర్మాత‌లు కూడా త‌క్కువ కాదు. చాలా మంది నిర్మాత‌లు లోపాయకారిగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

దాస‌రి మాట విన్న‌ది ఎంత మంది:

త‌మ బ్యాన‌ర్లోనే ముందుగా సినిమా చేయాల‌నే అత్యాశ‌..ఆ హీరో త‌మ సంస్థ‌లో సినిమా చేయ‌డ‌మే మ‌హా భాగ్యంగా భావించడం వంటివి జ‌రుగుతుంటాయి. తమ టోకెన్ నెంబ‌ర్ ఎప్పుడొస్తుందా? అని క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తుంటారు. ఈ క్ర‌మంలో కొంద‌రు నిర్మాతలు ఇత‌ర హీరోల తో సినిమాలు చేసి అప్పుల పాలు అవుతుంటారు. తాను కోరుకున్న హీరో టోకెన్ నెంబ‌ర్ వ‌చ్చే స‌రికి చేతిలో చిల్లిగ‌వ్వ ఉండ‌దు. ఆ స‌మ యంలో ఇచ్చిన అడ్వాన్సులు కూడా రాబ‌ట్టు కోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. టాలీవుడ్ లో ఇలాంటి క‌థ‌లు కో కొల్ల‌లు. నిర్మాత‌లు ఇలాంటి శైలితో ఉండొద్ద‌ని ద‌ర్శక‌ర‌త్న దాసరి నారాయ‌ణ‌రావు ఎన్నోసార్లు హిత‌వు ప‌లికారు. కానీ ఆయ‌న మాట ప‌ట్టించుకున్న‌ది ఎంత మంది.