Begin typing your search above and press return to search.

ఒకే రోజు 5 సినిమాలు.. బాక్సాఫీస్ దబిడి దిబిడే

బాక్సాఫీస్ వద్ద ఒక్కోసారి ఒక్కో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి సినిమాలేవీ లేక థియేటర్లు కళ తప్పిపోతాయి.

By:  M Prashanth   |   8 Aug 2025 1:37 PM IST
ఒకే రోజు 5 సినిమాలు.. బాక్సాఫీస్ దబిడి దిబిడే
X

బాక్సాఫీస్ వద్ద ఒక్కోసారి ఒక్కో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి సినిమాలేవీ లేక థియేటర్లు కళ తప్పిపోతాయి. కానీ ఇంకోసారి మాత్రం నాలుగైదు సినిమాలు ఒకే రోజున వచ్చేందుకు సిద్ధమైపోతాయి. ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో కొత్తేమీ కాదు. కానీ, మరోసారి బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉండనుంది. అదే సెప్టెంబర్ 05న తేదీ.

వచ్చే నెల 5న ఒకటి కాదు రెండు కాదు అయిదు పాన్ఇండియా సినిమాలు తలబడుతున్నాయి. ఇలా ఒకే రోజు ఐదు భారీ అంచనాలున్న సినిమాలు అదృష్టం పరీక్షించుకుంటుండడంతో ఆసక్తి నెలకొంది. అందులో సినిమాలు గమనించినట్లైతే,..హను మాన్ ఫైమ్ తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ ఉంది. ఈ సినిమా విడుదల తేదీ లో ఏ మార్పు ఉండదని ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గట్టిగా చెప్పేశారు. దీంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది.

హను మాన్ తర్వాత తేజ చేసిన సినిమా కావడంతో అతడి మార్కెట్ ఈ సినిమాతో తెలియనుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కంప్లీట్ విజువల్ ఎఫెక్ట్స్ కు తో ఇది తెరకెక్కింది. సీనియర్ హీరోయిన్ అనుష్క ఘాటీ కూడా అదే రోజు రానుంది. క్రిష్ దర్శకత్వం వహించారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క బిగ్ స్క్రీన్ పైకి రావడం ఇదే తొలిసారి. ఈ సినిమాపై రీసెంట్ గా ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు పెరిగిపోయాయి.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా అదే రోజు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అధికారికంగా త్వరలోనే క్లారిటీ రావొచ్చు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మార్కెట్ మాత్రం పూర్తిగా రష్మిక ఇమేజ్ మీదే ఉంది. ఈ సినిమాలతోపాటు మరో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా అదే రోజు రానున్నాయి. శివ కార్తికేయన్ మదరాసి, బిచ్చగాడు ఫేమ్ విజయ్ అంటోనీ భద్రకాళి సినిమాలు సెప్టెంబర్ 05నే విడుదల కానున్నాయి.

మదరాసిని మురుగదాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ అవ్వనుంది. మరోవైపు భద్రకాళి సినిమాను సురేష్ ప్రొడక్షన్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. అయితే అందరూ సెప్టెంబర్ 5నే రావడంతో ప్రేక్షకులకు కూడా ఎక్కువ ఆప్షన్లు ఉండనున్నాయి. మరి ఈ 5 సినిమాలు అదే రోజు వస్తాయా? లేదా ఏవైనా తప్పుకుంటాయా చూడాలి.