Begin typing your search above and press return to search.

సౌండ్ లేకుండా 70 కోట్లు కొట్టేసిన సినిమా

తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఎవరూ అంచనా వేయని ఈ మలయాళ థ్రిల్లర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రేడ్ వర్గాల్లో సీరియస్‌గా చర్చనీయాంశమవుతోంది.

By:  Tupaki Desk   |   29 April 2025 9:58 PM IST
సౌండ్ లేకుండా 70 కోట్లు కొట్టేసిన సినిమా
X

ఇప్పుడు సినిమా విడుదల అంటే సోషల్ మీడియాలో హడావుడి, ఇంటర్వ్యూల హడావుడి, యూట్యూబ్, బిల్ల్‌బోర్డ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ల దాకా వెళ్లకపోతే ఆ సినిమాకే రిలీజ్ లేదనిపించే రోజులు వచ్చాయి. కానీ ఈ గ్లామర్ ప్రమోషన్ పక్కన పెట్టేసి, కేవలం కథే ప్రమోషన్ అనే ఫార్ములాతో ఊపిరి పీల్చకుండా విజయాన్ని వేటాడుతున్న సినిమా ‘తుడరుమ్’.

తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఎవరూ అంచనా వేయని ఈ మలయాళ థ్రిల్లర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రేడ్ వర్గాల్లో సీరియస్‌గా చర్చనీయాంశమవుతోంది. వారం కూడా కాకుండా రూ.70 కోట్లు వసూలు చేసి, వంద కోట్లు టార్గెట్ చేస్తోందంటే.. అది కంటెంట్ వల్ల వచ్చిన క్రేజ్ తప్ప, స్టార్ పవర్ వల్ల కాదనడానికి ఇదే ఉదాహరణ కావాలి. మోహన్ లాల్ వంటి నటుడు ప్రెస్ మీట్లు, ప్రోమో షోలూ లేకుండా ఇలా థియేటర్లలో నిలబెట్టడం నిజంగా అరుదైన విషయం.

అసలు ఈ సినిమా కోసం ఓ ఇంటర్వ్యూకైనా మోహన్ లాల్ వెళ్లారా? డైరెక్టర్ తరుణ్ మూర్తి ఎక్కడైనా ప్రచారం చేశారా? కనీసం యూట్యూబ్ షార్ట్ ఇంటర్వ్యూలు కూడా రాలేదు. కానీ కేరళలో థియేటర్ల పరిస్థితి చూస్తే, ప్రీమియర్ షోల దగ్గరి నుంచే హౌస్ ఫుల్స్. అటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సైలెంట్ గా రిలీజ్ అయ్యినా, కొన్ని చోట్ల మంచి ఆక్యుపెన్సీకి చేరుకోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి.

కథ పరంగా చూస్తే ఇది 'దృశ్యం'కు దగ్గరగా అనిపించొచ్చు. కానీ స్క్రీన్‌ప్లే, ఎమోషన్, ఫ్యామిలీ లేయర్స్, పోలీసుల నేపథ్యాన్ని కలిపి దర్శకుడు కొత్తగా మలిచాడు. ముఖ్యంగా రంగస్థలంలోని చివరి ట్విస్ట్‌ని తీసుకుని, అది ఒక కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందన్న కోణంలో చూపించారు. కథన శైలి చాలా సూటిగా, ఎక్కడా చెదరకుండా సాగిపోవడం ప్రేక్షకుల్ని ఎమోషనల్‌గా కలిపేసింది. జెక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకి కొత్త ఊపును అందించింది.

ఇప్పుడు ఈ సినిమా హవా చూసి ట్రేడ్ వర్గాల్లో ఓ చర్చ మొదలైంది స్టార్ ప్రమోషన్ అవసరమేనా? ఒక సినిమా నమ్మకంగా తయారు చేస్తే, కంటెంట్‌నే నమ్మితే… ఆడియన్స్ ఎప్పుడూ అద్భుతంగా స్పందిస్తారు. ఇక్కడ 'తుడరుమ్' చేసినదే అదే. పాన్ ఇండియా సినిమా అంటే 200 కోట్ల బడ్జెట్ కావాలి అనే కాన్సెప్ట్‌కు ఇది షాక్ లాంటి ఉదాహరణ. చిన్న బడ్జెట్, పెద్ద విజయం. అంతే కాదు, ఇప్పుడు తుడరుమ్ సక్సెస్ చూసి, రెండో పార్ట్ సిద్ధం అవుతోంది.

మొత్తానికి చెప్పాలంటే, 'తుడరుమ్' పాఠం స్పష్టం – ప్రేక్షకుల్నీ, థియేటర్లనీ ఒక గొప్ప కథలే నడుపుతాయి. ప్రమోషన్ గొడవలూ, ఫ్యాన్స్ షోలూ లేని సినిమాలు కూడా గొప్ప విజయం సాధించగలవని మళ్లీ రుజువైంది. ఇక ఈ సినిమాతో కొత్త ఫ్రాంచైజ్ రూపుదిద్దుకుంటుందన్న మాట కూడా ఆసక్తికరంగా మారింది.