ఇక థియేటర్స్ కి నష్టాలు రాకుండా టాలీవుడ్ లో షేర్ గేమ్
ఇది మల్టీప్లెక్స్ లు ఫాలో అయ్యే సాధారణ రెవెన్యూ షేరింగ్ పద్ధతికే సమానం. అంటే సినిమా ఎంత వసూలు చేస్తే, దాని శాతం కింద థియేటర్‌లకు వాటా లభిస్తుంది.
By: Tupaki Desk | 29 April 2025 9:57 PM ISTఇటీవల కాలంలో థియేటర్ల సంఖ్య చాలా వరకు తగ్గుతున్న విషయం తెలిసిందే. సింగిల్ స్క్రీన్స్ షాపింగ్ మాల్స్ గా మారిపోతుండగా మరికొన్నీ మల్టీప్లెక్స్ తో అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇక కొన్ని థియేటర్లు అయితే సినిమా ఆడకపోతే కొన్ని రోజుల వరకు మూసేసే పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రతీ సినిమా విషయంలో థియేటర్ షేర్ ఉండాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆ విషయంలో చర్చలు జరిగినా ఇంతకాలం ఆచరణలోకి రాలేదు.
అయితే ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా బిజినెస్‌లో త్వరలోనే ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. నైజాం ఏరియాలోని అన్ని థియేటర్లు జూన్ 1 నుండి రెంటల్ మోడల్‌కి గుడ్‌బై చెప్పి రెవెన్యూ షేర్ మోడల్‌ను ఫాలో చేయబోతున్నాయి. ఇప్పటి వరకు చాలా కాలంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఫిక్స్‌డ్ రెంటల్ పద్ధతిలో సినిమాలు ప్రదర్శించేవి. కానీ ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు చిన్న సినిమాలకే కాదు, పెద్ద సినిమాలకు కూడా థియేటర్‌లో ఆడే సామర్థ్యాన్ని బట్టి డబ్బులు జమకానున్నాయి.
ఇది మల్టీప్లెక్స్ లు ఫాలో అయ్యే సాధారణ రెవెన్యూ షేరింగ్ పద్ధతికే సమానం. అంటే సినిమా ఎంత వసూలు చేస్తే, దాని శాతం కింద థియేటర్‌లకు వాటా లభిస్తుంది. ఈ విధానం వల్ల చిన్న సినిమాలకు మొదటి వారం తర్వాత ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది థియేటర్లు నిర్ణయించుకుంటాయి. పెద్ద సినిమాలు అయితే థియేటర్లకు లాభాలను భారీగా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్‌లు కూడా తమ హక్కులను మరింత స్పష్టంగా వినియోగించుకునే స్థితిలోకి వస్తున్నాయి.
ఇకపోతే ఈ మార్పుపై అన్నివైపులా పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, గుంటూరు వంటి ప్రాంతాల్లో ఈ మోడల్‌కు వ్యతిరేకంగా అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. థియేటర్ యాజమాన్యం మారుతున్న విధానాన్ని సినీ పరిశ్రమలో కొందరు స్వాగతిస్తున్నా, ఇంకొంతమంది మాత్రం చిన్న సినిమాలపై ప్రభావం పడతుందనే వాదనలతో ఉన్నారు. కానీ ఎగ్జిబిటర్స్ మాత్రం దీని వల్ల సినిమా బిజినెస్ మరింత స్థిరపడుతుందని విశ్వాసంగా ఉన్నారు.
అసలు ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే.. ప్రతి ఏడాది వచ్చే 200 సినిమాల్లో కేవలం 10 శాతం మాత్రమే బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతాయి. మిగిలిన సినిమాలు థియేటర్‌లకు బరువు మాత్రమే అవుతాయి. రెవెన్యూ షేర్‌లో అయితే హిట్ సినిమాలపై మరింత ఆదాయం వస్తుంది. ఫ్లాప్ సినిమాలు వస్తే పెద్ద నష్టాలు ఉండవు. ఈ లాజిక్‌తోనే చాలా థియేటర్ యాజమాన్యాలు ఈ మోడల్‌కి మద్దతు ఇస్తున్నాయి.
అంతేకాదు, ప్రేక్షకుల స్పందన లేని షోలను మల్టీప్లెక్సుల్లో ఎలా రద్దు చేస్తారో, ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా అదే హక్కును వినియోగించుకోనున్నారు. బుకింగ్స్ తక్కువగా ఉంటే షోని క్యాన్సిల్ చేసే వెసులుబాటు కల్పించుకుంటున్నారు. ఇది ఒకరకంగా థియేటర్ ఓనర్లకు రిస్క్ ఫ్యాక్టర్‌ను తగ్గించే మార్గం. ఈ తరహా వ్యూహాత్మక మార్పులు తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ విధానాన్ని కొంత మేరకు కొత్త దారిలో నడిపించబోతున్నాయి. ముఖ్యంగా రాబోయే పెద్ద సినిమాల పరంగా థియేటర్ల లాభాలు ఎంతవరకూ పెరుగుతాయో అనే అంశం పరిశ్రమలో ఆసక్తిగా మారుతోంది. చిన్న సినిమాలు మాత్రం కొత్త వ్యూహంలో ఎలా నిలబడతాయో చూడాలి.