మహేష్ - రాజమౌళి సినిమా.. ఓ ప్లాన్ క్యాన్సిల్?
మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ SSMB29 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Tupaki Desk | 7 July 2025 3:10 PM ISTమహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ SSMB29 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్ డ్రామా కోసం దర్శకుడు రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమా కోసం మొదట పలు విదేశీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. వాటిలో ముఖ్యంగా కెన్యా షెడ్యూల్ చాలా కీలకమైంది. అడవుల నేపథ్యంలో కొన్ని గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు అక్కడ చిత్రీకరించాలనే ఉద్దేశంతో ముందస్తు ఏర్పాట్లు జరిగాయి. స్కౌటింగ్, లొకేషన్ ఫిక్స్, అక్కడికి సంబంధించిన యాక్షన్ టీమ్ ఎంపిక వంటి పనులన్నీ పూర్తి చేశారు.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆ కెన్యా షెడ్యూల్‌ను చిత్రబృందం క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. కెన్యా దేశంలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితులు అనుకూలంగా లేనందున, చిత్రబృందం షూటింగ్‌ని అక్కడ చేయడం సేఫ్ కాదని భావించింది. దాంతో తాత్కాలికంగా ఆ షెడ్యూల్‌ను ఆపివేసినట్లు సమాచారం.
ఈ పరిణామం రాజమౌళిని తర్జన భర్జనల్లో నెట్టేసింది. ఎందుకంటే ఆ యాక్షన్ సన్నివేశాలకు అడవి వాతావరణం చాలా కీలకం. అలాంటి లొకేషన్ కోసం కొత్తగా మరో దేశాన్ని ఎంచుకోవాలా? లేక ఇండియాలోనే ప్రత్యేకంగా సెట్ వేసుకోవాలా? అనే విషయంపై రాజమౌళి టీం చర్చలు జరుపుతోంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే హైదరాబాద్‌లో కాశీ సెటప్ తయారవుతోంది. అక్కడే కొన్ని సీన్స్ ప్లాన్ చేసినట్లుగా టాక్.
ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు బయటకు రాకపోయినా, వచ్చిన లీక్‌లు, వివరాలు సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి 200 నిమిషాల రన్ టైమ్ ఉండబోతుందని వార్తలు రావడం విశేషం.
మొత్తానికి మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ షెడ్యూల్ మారినా, ప్రాజెక్ట్‌పై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. కెన్యా షెడ్యూల్ రాకపోయినా, దానికి సమానమైన లొకేషన్ ఎంచుకుని రాజమౌళి తన మార్క్ విజువల్స్ ఇవ్వడం ఖాయం. ఇక ఈ సినిమాపై మేకర్స్ నుంచి అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.