నటితో నిర్మాత లవ్.. రాఖీ చేతికిస్తే తాళి కట్టాడు!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత తనకు అప్పటికే పెళ్లయి భార్య, పిల్లలు ఉన్నా, తన సినిమాల్లో నటించిన పాపులర్ కథానాయికతో ప్రేమలో పడ్డాడు.
By: Sivaji Kontham | 14 Aug 2025 2:00 AM ISTరంగుల పరిశ్రమలో కొన్ని రిలేషన్ షిప్స్ చాలా వింతగా మొదలవుతాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత తనకు అప్పటికే పెళ్లయి భార్య, పిల్లలు ఉన్నా, తన సినిమాల్లో నటించిన పాపులర్ కథానాయికతో ప్రేమలో పడ్డాడు. అంతేకాదు.. తనను పెళ్లాడాల్సిందే అంటూ ఆ హీరోయిన్‌ని వెంబడించాడు. పదే పదే వెంటపడి విసిగించాడు. అతడిని పెళ్లాడటం ఇష్టం లేని సదరు నటి కొన్నాళ్ల పాటు షూటింగులకు రాకుండా డుమ్మా కొట్టిందని కథనాలొచ్చాయి. చాలా కాలం పాటు అతడితో మాట్లాడటం కూడా మానేసింది. కానీ అతడు వెంటపడటం ఆపలేదు. తనను పెళ్లాడాల్సిందేనని పట్టు పట్టాడు. ప్రేమ ముదిరి పాకాన పడటంతో లేటు వయసు వరుడిని తట్టుకోలేని పరిస్థితి ఎదురైంది.
కానీ విధి విచిత్రమైనది.. సదరు కథానాయిక చివరికి అతడి ప్రేమను అంగీకరించింది. భార్య, పిల్లలు ఉన్నారని తెలిసి కూడా రహస్యంగా పెళ్లాడేసింది. ఆ తర్వాత ఆ నిర్మాత కుటుంబంలో చాలా తగాదాలు మొదలయ్యాయి. సవతిని అంగీకరించేందుకు మొదటి భార్య ఎప్పుడూ సిద్ధంగా లేదు. మొదటి భార్య పిల్లలు చాలా డిస్ట్రబ్ అయ్యారు. కానీ రెండిళ్ల పూజారిగా ఆ నిర్మాత తన జీవిత నావను ముందుకు నడిపించాడు. ఈ కథంతా ఏ జంట గురించి? అంటే.. అతిలోక సుందరి శ్రీదేవి- నిర్మాత బోనికపూర్ గురించే.
ఈ జంట ప్రేమకథలో ఊహించని ట్విస్టు కూడా ఒకటి ఉంది. నిజానికి శ్రీదేవిపై తన కుమారుని క్రష్ గురించి తెలుసుకున్న బోనీ తల్లి గారు.. రక్షాబంధన్ రోజున అతడి చేతికి ఒక రాఖీ ఇచ్చింది. ఒక రూమ్ లోకి పిలిచి శ్రీదేవికి రాఖీ కట్టాలని తనయుడిని కోరింది. కానీ అతడు రాఖీతో పాటు పక్కనే ఒక తాళిని కూడా ఉంచాడు. తాళి కడతానని అన్నాడు. 1996 జూన్ 2న షిర్డీలో శ్రీదేవిని బోనీకపూర్ రహస్యంగా పెళ్లాడారు. 1997లో మరోసారి పబ్లిక్ కోసం అతడు బహిరంగంగా పెళ్లాడాడు. ఆ జంటకు జాన్వీకపూర్- ఖుషికపూర్ అనే ఇద్దరు పిల్లలు కలిగారు.