చీటింగ్ కేసులో మలయాళ అగ్ర నటుడు అరెస్ట్
గతేడాది సాబిన్ షౌహిర్ కీలక పాత్రలో నటిస్తూ మంజుమ్మల్ బాయ్స్ ను నిర్మించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 July 2025 10:31 PM ISTమలయాళ చిత్ర పరిశ్రమలో ఓ ఘటన చోటు చేసుకుంది. గతేడాది వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ తో సహా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు సుపరిచితులైన నటుడు, ప్రొడ్యూసర్ సౌబిన్ షాహిర్, మరో ఇద్దరిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. సౌబిన్ షాహిర్, అతని తండ్రి బాబు షాహిర్, మంజుమ్మల్ బాయ్స్ నిర్మాత షాన్ ఆంటోనీలను చీటింగ్, ఫోర్జరీ కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతేడాది సాబిన్ షౌహిర్ కీలక పాత్రలో నటిస్తూ మంజుమ్మల్ బాయ్స్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సౌబిన్ తో పాటూ అతని తండ్రి బాబు షాహిర్, షాన్ ఆంటోనీ కూడా నిర్మించారు. గుణ కేవ్స్ సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కేవలం మలయాళంలోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయగా అన్ని భాషల నుంచి మంజుమ్మల్ బాయ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా సుమారు రూ.250 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. సినిమా నిర్మాణం టైమ్ లో నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీలు తన వద్ద రూ.7 కోట్లు పెట్టుబడిగా తీసుకున్నారని, రిలీజయ్యాక వచ్చిన లాభాల్లో ముందు అనుకున్న ప్రకారం 40% వాటా ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారని కానీ ఇప్పుడు లాభాల్లో వాటా ఇవ్వడం లేదని సిరాజ్ వలియతర హమీద్ అనే ఇన్వెస్టర్ వారిపై కేసు పెట్టి కోర్టును ఆశ్రయించారు.
సదరు నిర్మాతలు రూ.47 కోట్టు మోసం చేశారని సిరాజ్ గతేడాది ఏప్రిల్ 23న కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరడంతో పాటూ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సదరు నిర్మాతలు కేరళ కోర్టుకు వెళ్లగా కోర్టు వారికి తాత్కాలిక బెయిల్ ఇచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ రద్దు పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది. దీంతో మారాడు స్టేషన్ పోలీసులు సోమవారం వారిని విచారణకు పిలిచి తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినప్పటికీ వారు వెంటనే బెయిల్ పై రిలీజ్ అయి బయటికొచ్చారు. ప్రస్తుతం ఈ విషయంలో మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.