'కల్కి' విషయంలో టెన్షన్ పడ్డాను..!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కల్కి 2898 ఏడీ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 29 April 2025 3:00 PM ISTప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కల్కి 2898 ఏడీ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ భారీ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అంటూ ప్రకటన చేసిన సమయంలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు ఆయన సంగీతాన్ని ఇవ్వగలడా.. తెలుగు ప్రేక్షకులను మెప్పించగలడా, ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకోగలడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పెద్దగా పాటలు లేకపోవడంతో మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనే ఆకట్టుకోవాల్సి ఉంటుంది. కల్కి కోసం విభిన్నమైన సంగీతాన్ని సంతోష్ నారాయణన్ ఇచ్చాడు.
ముఖ్యంగా కొన్ని పౌరాణిక ఘట్టాలకు సంబంధించిన సన్నివేశాలు వచ్చిన సమయంలో వచ్చిన సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆకట్టుకునే సంగీతంతో సంతోష్ నారాయణన్ సినిమా స్థాయిని పెంచాడు. యాక్షన్ సన్నివేశాలు, ఫ్యూచర్ సీన్స్ అన్నింటిలోనూ ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచింది అనడంలో సందేహం లేదు. సినిమా సూపర్ హిట్ సాధించడంలో ఖచ్చితంగా సంగీతం పాత్ర ప్రముఖంగా ఉంది. కల్కి 2 కోసం కూడా సంతోష్ నారాయణన్ పని చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే జరిగినట్లు సమాచారం అందుతోంది. కొంత మేరకు షూటింగ్ కూడా పూర్తి అయింది.
సంతోష్ నారాయణన్ తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'రెట్రో' సినిమా కోసం వర్క్ చేశాడు. రెట్రో సినిమాలోని పాటలకు మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా సంతోష్ నారాయణన్ స్వరపరచిన కనిమా, ది వన్ పాటలు మంచి స్పందన దక్కించుకున్నాయి. యూట్యూబ్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో ఈ పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఈ పాటలు ఉన్నాయి. తాజాగా చెన్నైలో జరిగిన ఒక అవార్డ్ వేడుకలో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ మాట్లాడుతూ కల్కి, రెట్రో సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ బెస్ట్ ఈ రెండు సినిమాలు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
కల్కి పార్ట్ 1 కి వర్క్ చేసిన తర్వాత చాలా టెన్షన్ పడ్డాను. మొదట్లో వచ్చిన స్పందన చూసి కాస్త ఆందోళన చెందిన విషయం నిజం. నేను స్వరపరచిన సంగీతం నచ్చిందా అని దర్శకుడు నాగ్ అశ్విన్‌ను పలు సందర్భాల్లో అడిగాను. ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. రెట్రో సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, కల్కి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌లు నాకు సంగీతం విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ రెండు ఆల్బమ్‌లు నా కెరీర్‌లో చాలా స్పెషల్‌గా నిలిచాయని అన్నాడు. కల్కి పార్ట్ 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగానూ సంతోష్ నారాయణన్ చెప్పుకొచ్చారు. రెట్రో సినిమా తర్వాత ఈ సంగీత దర్శకుడు మరింత బిజీ కానున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.