Begin typing your search above and press return to search.

RC17 స్క్రిప్ట్ లాకైందా?

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ క్రేజ్, మార్కెట్ రెండూ గ్లోబ‌ల్ స్థాయిలో విప‌రీతంగా పెరిగిపోయాయి.

By:  Tupaki Desk   |   8 July 2025 12:07 PM IST
RC17 స్క్రిప్ట్ లాకైందా?
X

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ క్రేజ్, మార్కెట్ రెండూ గ్లోబ‌ల్ స్థాయిలో విప‌రీతంగా పెరిగిపోయాయి. ఎంతో టైమ్ కేటాయించి, భారీ ఆశ‌ల‌తో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో గేమ్ ఛేంజ‌ర్ చేస్తే ఆ సినిమా దారుణ‌మైన ఫ్లాపుగా మారింది. దీంతో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్, అత‌ని ఫ్యాన్స్ ప్ర‌స్తుతం బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పెద్ది సినిమాపైనే త‌మ హోప్స్ ను పెట్టుకున్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంద‌రికీ మంచి అంచ‌నాలున్నాయి. ప్ర‌స్తుతం పెద్ది షూటింగ్ శ‌రవేగంగా జ‌రుగుతుంది. జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తుండ‌గా వ‌చ్చే ఏడాది మార్చి 27న పెద్ది రిలీజ్ కానుంది. అక్టోబ‌ర్ నాటికి పెద్ది సినిమాను పూర్తి చేసి త‌ర్వాతి సినిమాను మొద‌లుపెట్టాల‌ని చ‌ర‌ణ్ చూస్తున్నార‌ట‌.

పెద్ది మూవీ చ‌ర‌ణ్ కెరీర్ లో 16వ సినిమాగా తెరకెక్కుతుంది. దీని త‌ర్వాత చ‌ర‌ణ్ త‌న 17వ సినిమాను డైరెక్ట‌ర్ సుకుమార్ తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఇప్పుడు సినిమా లాక్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీని కోసం సుకుమార్ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ ను పూర్తి చేశార‌ని, అన్నీ చూసుకుని మంచి టైమ్ లో సినిమాను అనౌన్స్ చేయ‌నున్నార‌ని అంటున్నారు.

కాగా ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రంగ‌స్థ‌లం సినిమా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ చేసిన రంగ‌స్థ‌లం సినిమా అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌వ‌డంతో పాటూ ఆ సినిమాతో డైరెక్ట‌ర్ గా సుకుమార్ కు, హీరోగా రామ్ చ‌ర‌ణ్ కు చాలా మంచి ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చాయి. ఈసారి చ‌ర‌ణ్ తో సుకుమార్ చేయ‌బోయే సినిమా రంగ‌స్థ‌లాన్ని మించి ఉంటుంద‌ని సుకుమార్ స‌న్నిహితులంటున్నారు.