ఆ సినిమా కోసం చెన్నైకు మోహన్‌లాల్!
అయితే జైలర్ సినిమా తరహాలోనే జైలర్2లో కూడా కొన్ని గెస్ట్ రోల్స్ ఉంటాయని మొదటి నుంచి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 July 2025 12:00 PM ISTరజినీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా జైలర్. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న టైమ్ లో రజినీకాంత్ నెల్సన్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటికే బీస్ట్ సినిమాతో ఫ్లాపును అందుకున్న నెల్సన్ తో సినిమా ఏంటని రజినీ ఫ్యాన్స్ గోల చేశారు. అయినప్పటికీ, సూపర్ స్టార్.. కథను, నెల్సన్ ను నమ్మి జైలర్ చేశారు. తనపై రజినీ పెట్టుకున్న నమ్మకాన్ని నెల్సన్ నిలబెట్టుకున్నారు. జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.650 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
చాలా కాలం తర్వాత రజినీకి సాలిడ్ కంబ్యాక్ దక్కింది. జైలర్ లో రజినీతో పాటూ మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్లు కూడా మెరవడంతో సినిమా స్థాయి మరింత పెరిగింది. జైలర్ సక్సెస్ ఇచ్చిన బూస్టప్ తో దానికి సీక్వెల్ గా జైలర్2 చేస్తున్నారు రజినీ- నెల్సన్. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది.
అయితే జైలర్ సినిమా తరహాలోనే జైలర్2లో కూడా కొన్ని గెస్ట్ రోల్స్ ఉంటాయని మొదటి నుంచి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు మోహన్ లాల్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వినిపిస్తోంది. మోహన్ లాల్ చెన్నై వెళ్లి జైలర్2 షూటింగ్ లో పాల్గొన్నారని చెప్తున్నారు. కానీ జైలర్2 మేకర్స్ మాత్రం ఈ మూవీలో మోహన్ లాల్ జాయిన్ అయినట్టు ఇంకా అనౌన్స్ చేయలేదు.
ఇదిలా ఉంటే ఇంకొందరు మాత్రం మోహన్ లాల్ జులై ఆఖరికి జైలర్2 షూటింగ్ లో పాల్గొననున్నారని చెప్తున్నారు. ఇందులో నిజమేంటన్నది తెలియాల్సి ఉంది. ఇక రజినీకాంత్ విషయానికొస్తే ప్రస్తుతం జైలర్2 షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్న ఆయన మరోవైపు కూలీ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉపేంద్ర, నాగార్జున, ఆమిర్ ఖాన్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించిన కూలీపై అందరికీ మంచి అంచనాలున్నాయి.