రజినీ స్పీచ్‌పై తొలిసారి విమర్శలు
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ.. వ్యక్తిగా ఎంతో ఒదిగి ఉంటారన్న సంగతి తెలిసిందే.
By: Garuda Media | 14 Aug 2025 12:18 AM ISTసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ.. వ్యక్తిగా ఎంతో ఒదిగి ఉంటారన్న సంగతి తెలిసిందే. బయట బట్టతలతో 70 ఏళ్లు పైబడ్డ ఓ ముసలి వ్యక్తి ఎలా ఉంటారో అలాగే కనిపించే ఆయన.. మాటల్లో కూడా అణకువగానే వ్యవహరిస్తారు. అహంకారం చూపించరు. వివాదాల జోలికి వెళ్లరు. తన సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరైనపుడు నాలుగు మంచి మాటలు చెప్పి, అభిమానుల్లో స్ఫూర్తి నింపడానికే ప్రయత్నిస్తారు.
ఐతే తన కొత్త చిత్రం ‘కూలీ’కి సంబంధించి చెన్నైలో జరిగిన ఈవెంట్లో మాత్రం రజినీ ప్రసంగం కొంత వివాదాస్పదమైంది. ఆ ప్రసంగంలో రజినీ కామెంట్లు సోషల్ మీడియా జనాలకు రుచించట్లేదు. ఎన్నడూ లేని విధంగా రజినీ మీద ట్రోలింగ్ జరుగుతోంది. రజినీ వయసుకు తగ్గట్లు మాట్లాడలేదని, తన కోస్టార్స్‌ను కించపరిచేలా కామెంట్లు చేస్తున్నారని ఆయన మీద కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యంగా ‘కూలీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సోబిన్ షాహిర్ గురించి రజినీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ సినిమాలో ఒక పాత్రకు సోబిన్‌ను తీసుకుంటున్నట్లు దర్శకుడు లోకేష్ కనకరాజ్ చెబితే.. అతను పొట్టిగా ఉంటాడు, పైగా బట్టతల ఉంటుంది.. అలాంటోడిని ఈ పాత్రకు ఎలా తీసుకుంటారు అని తాను ఆశ్చర్యపోయినట్లు రజినీ వ్యాఖ్యానించాడు. తర్వాత సౌబిన్ మీద ప్రశంసలు కురిపించినప్పటికీ.. ఆ కామెంట్ విషయంలో ఆయన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఒక ప్రతిభావంతుడైన నటుడిని ఉద్దేశించి బాడీ షేమింగ్ చేయడమేంటి అని రజినీని నిలదీస్తున్నారు.
మరోవైపు ఆమిర్ ఖాన్‌ను ఉద్దేశించి కూడా పొట్టివాడు అంటూ రజినీ కామెంట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. అంతే కాక శ్రుతి హాసన్ పాత్ర గురించి మాట్లాడుతూ.. ఆమె గ్లామర్ హీరోయిన్ అని, అలాంటి అమ్మాయి ఈ పాత్ర చేస్తుందా అని అడిగినట్లు రజినీ చెప్పగా.. తన స్నేహితుడి కూతురైన శ్రుతి గురించి ఇలా మాట్లాడ్డమేంటి అంటూ దాన్ని కూడా తప్పుబడుతున్నారు నెటిజన్లు. రజినీ సరదాగా మాట్లాడే క్రమంలో లైటర్ వీన్‌లోనే ఈ కామెంట్లు చేసినప్పటికీ.. ఆయనంటే గిట్టని వాళ్లు వీటిని వివాదాస్పదం చేస్తున్నారు.