Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : కూలీ సెట్‌లో సూపర్ స్టార్స్‌

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Ramesh Palla   |   11 Aug 2025 4:54 PM IST
పిక్‌ టాక్‌ : కూలీ సెట్‌లో సూపర్ స్టార్స్‌
X

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'కూలీ' సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాకు రోజు రోజుకు బజ్‌ పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపుగా రూ.75 కోట్ల ప్రీ సేల్‌ ద్వారా రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్‌లో అన్ని భాషల వర్షన్‌లకు అడ్వాన్స్ బుకింగ్‌ ఓ రేంజ్‌లో నమోదు అవుతోంది. సినిమాకు రోజు రోజుకు పెరుగుతున్న బజ్‌ నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్స్ ను రాబడుతుందనే విశ్వాసం ను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ మాత్రమే కాకుండా నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర, సౌబిన్‌ వంటి స్టార్స్ ఉన్న కారణంగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రమోషన్‌ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలు మరింతగా పెంచుతున్నారు.

కూలీ బాక్సాఫీస్ టార్గెట్‌ రూ.500 కోట్లు

కూలీ సినిమాకు లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వం వహించాడు. ఇప్పటి వరకు లోకేష్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా కమల్‌ హాసన్‌తో లోకేష్ కనగరాజ్‌ రూపొందించిన 'విక్రమ్‌' సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత లియో సైతం విజయ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల జాబితాలో నిలిచింది. ఇలా ఆయా హీరోకు లోకేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ మూవీని ఇస్తున్నాడు. అందుకే కూలీ సినిమాతో రజనీకాంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అంతే కాకుండా లాంగ్‌ రన్‌లో సినిమా రూ.500 కోట్లకు మించి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి అంటూ కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ వర్గాల వారు మాత్రమే కాకుండా సినీ విశ్లేషకులు, మీడియా వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు.

రజనీకాంత్‌ కూలీ సినిమాలో అమీర్ ఖాన్‌

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. కూలీ సినిమా షూటింగ్‌ సమయంలో రజనీకాంత్‌, అమీర్‌ ఖాన్‌, శృతి హాసన్‌ ఇంకా తదితరులు సీరియస్‌గా మానిటర్‌లో చూస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఇప్పటి వరకు కూలీ సినిమాలో ఆమీర్‌ ఖాన్‌ నటించాడు అనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ నుంచి ఈ ఫోటో రావడంతో అమీర్‌ ఖాన్‌ ఉన్నట్లు కన్ఫర్మ్‌ అయింది. ఈ ఫోటోను షేర్ చేసిన లోకేష్ కనగరాజ్‌ తన సన్నిహిత ఎడిటర్‌ ఫిలోమిన్‌ రాజ్‌ కి కృతజ్ఞతలు తెలియజేశాడు. కెరీర్‌ ఆరంభం నుంచి తనకు అండగా నిలుస్తూ, తన విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఫోటోను షేర్ చేశాడు.

టాలీవుడ్‌ హీరోలతో లోకేష్ కనగరాజ్‌ మూవీ

లోకేష్ కనగరాజ్‌ సినిమాల లైనప్‌ భారీగా ఉంది. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలకు సంబంధించిన సీక్వెల్స్ లైన్‌ లో ఉన్నాయి. మొదట ఖైదీ సినిమా కి సీక్వెల్‌ రాబోతున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత విక్రమ్‌ కి సీక్వెల్‌ రానున్నట్లు సమాచారం అందుతోంది. లియో కి సైతం సీక్వెల్‌ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాల సీక్వెల్స్ జాబితా పెద్దగా ఉంది. ఈ సినిమాలు కాకుండా టాలీవుడ్‌ లో ఇద్దరు స్టార్‌ హీరోలతో సినిమాలను చేసేందుకు గాను దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ రెడీగా ఉన్నాడు. ఆ సినిమాలు త్వరలోనే ప్రారంభం అవుతాయని అంటున్నారు. లోకేష్ సినిమాల మేకింగ్‌ చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఏ సినిమా అయినా 150 రోజుల లోపు వర్కింగ్‌ డేస్‌లోనే పూర్తి చేస్తాడు. కనుక రాబోయే రోజుల్లో లోకేష్ కనగరాజ్ నుంచి ఏడాదికి రెండు సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.