Begin typing your search above and press return to search.

రాజమౌళి ప్రెస్ మీట్ ఎప్పుడో?

మహేష్ బాబుతో జక్కన్న సినిమాకు సంబంధించి కూడా ఇలాంటి ఒక ప్రెస్ మీట్ ఉంటుందని చాలా రోజుల ముందే వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   28 April 2025 7:00 PM IST
SS Rajamouli Press Meet Update
X

తన సినిమా మొదలవడానికి ముందే లేదా షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే కథేంటో చూచాయిగా చెప్పేయడం.. సినిమాలో కాస్ట్ అండ్ క్రూ గురించి.. మరి కొన్ని విశేషాల గురించి వెల్లడించడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఈగ’ సినిమా కథను క్రిస్టల్ క్లియర్‌‌గా ముందే చెప్పి చిత్రీకరణ మొదలుపెట్టడం ఆయనకే చెల్లు. ‘బాహుబలి’ సినిమా మొదలు కావడానికి ముందే ప్రెస్ మీట్లో ఆ సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సెట్స్ మీదికి వెళ్లిన కొన్ని నెలలకు ప్రెస్ మీట్ పెట్టి కథ గురించి చెప్పేశారు.

మహేష్ బాబుతో జక్కన్న సినిమాకు సంబంధించి కూడా ఇలాంటి ఒక ప్రెస్ మీట్ ఉంటుందని చాలా రోజుల ముందే వార్తలు వచ్చాయి. అభిమానులు కూడా దాని కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమా మొదలు కావడానికి ముందే ప్రెస్ మీట్ అని ముందు గుసగుసలు వినిపించాయి. తర్వాతేమో తొలి షెడ్యూల్ షూటింగ్ అయ్యాక అన్నారు. ఆపై ఫారిన్ షెడ్యూల్ మొదలవడానికి ముందు టీం మీడియాను కలుస్తుందన్నారు.

కానీ నెలలు గడిచిపోతున్నాయి. మహేష్-రాజమౌళి సినిమాకు సంబంధించి అధికారికంగా ఏ అప్‌డేట్ లేదు. సినిమా ప్రారంభోత్సవం గురించి, ఇప్పటిదాకా జరిగిన రెండు షెడ్యూళ్ల షూటింగ్ గురించి ఏ అధికారిక సమాచారం బయటికి రాలేదు. త్వరలోనే చిత్ర బృందం భారీ షెడ్యూల్ కోసం ఆఫ్రికాకు వెళ్లబోతోంది. ఈ లోపు ప్రెస్ మీట్ లాంటిదేమీ ఉండే సంకేతాలు కనిపించడం లేదు. తన సినిమాల గురించి మీడియా వాళ్లు, అభిమానులు అడక్కముందే ప్రెస్ మీట్ పెట్టి విశేషాలు పంచుకునే రాజమౌళి.. ఈసారి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

‘హిట్-3’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మహేష్ మూవీ గురించి యాంకర్ సుమ అడగబోతే జక్కన్న పెదవి విప్పలేదు. లోపలి విశేషాలు చెప్పకపోయినా.. షూటింగ్ జరుగుతోంది, ఒకట్రెండు షెడ్యూళ్లు అయ్యాయి అని చెప్పడానికి కూడా జక్కన్న ఇష్టపడలేదు. పూర్తిగా మౌనం వహించాడు. అసలే మహేష్ బాబును మూడేళ్లకు పైగా స్క్రీన్ మీద చూడలేమని ఫీలవుతున్న మహేష్ ఫ్యాన్స్.. కనీసం సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ కూడా ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరి జక్కన్న ఎందుకింత గోప్యత పాటిస్తున్నారో?