మహాభారతం.. ఈ ముచ్చట్లకేం కానీ
సగటు మాస్ చిత్రాలతో ప్రయాణం మొదలుపెట్టి.. ‘బాహుబలి’ లాంటి విజువల్ వండర్‌తో దేశంలోనే నంబర్ వన్ దర్శకుడి స్థాయికి ఎదిగాడు రాజమౌళి.
By: Tupaki Desk | 28 April 2025 6:00 PM ISTసగటు మాస్ చిత్రాలతో ప్రయాణం మొదలుపెట్టి.. ‘బాహుబలి’ లాంటి విజువల్ వండర్‌తో దేశంలోనే నంబర్ వన్ దర్శకుడి స్థాయికి ఎదిగాడు రాజమౌళి. జక్కన్న స్వయంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించుకున్న ‘మహాభారతం’ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఐతే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదని చెప్పడమే కాక, ఆ సినిమా తీయడానికి తనకు ఇంకా చాలా అనుభవం కావాలని, అందుకోసం ఓ పదేళ్లయినా పడుతుందని రాజమౌళి చెప్పి పుష్కర కాలం దాటిపోయింది. ‘బాహుబలి’ని అనౌన్స్ చేసినపుడు చెప్పాడు జక్కన్న ఈ మాట.
ఐతే ప్రస్తుతం మహేష్ సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి.. ఆ సినిమా నుంచి బయటికి రావడానికి ఇంకో మూడేళ్లయినా పట్టేలా ఉంది. మామూలు చిత్రాలకే స్క్రిప్టు తయారీ, ప్రి ప్రొడక్షన్ కోసం చాలా టైం పడుతుంది. ప్రొడక్షన్ సంగతి తెలిసిందే. అలాంటిది మహాభారతం తీయాలంటే ఎన్నేళ్లు పడుతుందో అంచనా వేయడమే కష్టం.
ఓవైపు ఆమిర్ ఖాన్ భారీ స్థాయిలో ‘మహాభారతం’ తీయడానికి చూస్తున్నాడు. రాజమౌళి ఈ ప్రాజెక్టును నెత్తికెత్తుకుంటే తాను తప్పుకుందామని ఆమిర్ ఒక దశలో భావించాడు. కానీ రాజమౌళి వేరే కమిట్మెంట్ల వల్ల ఈ మెగా ప్రాజెక్టు ఆలస్యం అవుతూ ఉంది. దీంతో ఆమిర్ తన పాటికి తాను ‘మహాభారతం’ తీయడానికి సన్నాహాలు వేగవంతం చేశాడు. రాజమౌళేమో.. ఎప్పటికప్పుడు ‘మహాభారతం’ గురించి ఊరించే మాటలు చెబుతూ వస్తున్నాడు. తాజాగా ‘హిట్-3’ ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ నాని ఆ ప్రాజెక్టులో భాగం అవుతాడని ప్రకటించాడు.
అభిమానులేమో నానికి అందులో ఏ పాత్ర అయితే బాగుంటుంది.. అర్జునుడా, నకులుడా, సహదేవుడా అని చర్చించుకుంటున్నారు. మిగతా ముఖ్య పాత్రల్లో ఎవరు ఏది చేస్తారు అనే చర్చలు కూడా ఎప్పట్నుంచో నడుస్తున్నాయి. ఈ చర్చలు పుష్కర కాలం నుంచి నడుస్తున్నవే కానీ, ఇప్పటికే చాలినంత అనుభవం గడించి, 51 ఏళ్ల వయసుకు చేరుకున్న జక్కన్న.. మహేష్ మూవీ తర్వాత అయినా మహాభారతం మొదలుపెడితే బాగుండని అనుకుంటున్నారు. మరి మధ్యలో ఇంకేదైనా ప్రాజెక్టు వచ్చి పడుతుందా లేక 2027లో అయినా జక్కన్న ‘మహాభారతం’ పనులు మొదలుపెడతాడా అన్నది చూడాలి.