రాజమౌళి చిట్ట చివరి సినిమా ఇదే
ఇందులో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ స్టార్లు నటించే అవకాశం ఉంది.
By: Tupaki Desk | 29 April 2025 10:00 PM ISTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి హవా ఇంకెన్నాళ్లు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? ఆయన అభిమానులు అయితే అసలు ఎండింగే లేని రాజమౌళిని కోరుకుంటారు. జక్కన్న శిల్పాలన్నిటినీ తనివితీరా చూసుకుని తరించాలని ఆరాటపడతారు. ఆయన సినిమాలు ఆ స్థాయిలో వినోదాన్ని అందిస్తున్నాయి. రాజీ అన్నదే లేని పోరాటం, మేకింగ్ శైలి అతడి ప్రత్యేకత. అందుకే బాహుబలి, బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్, ఎస్ఎస్ఎంబి 29 ఇలాంటి అజేయమైన సినిమాలతో ముందుకు సాగుతున్నారు రాజమౌళి.
అయితే రాజమౌళి రిటైర్‌మెంట్ ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం ఊహిస్తున్నారు కొందరు విశ్లేషకులు. చూస్తుంటే మహేష్ బాబుతో సినిమాని పూర్తి చేసిన తర్వాత రాజమౌళి కచ్ఛితంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పనులు చేస్తున్నారు. మహాభారతం స్పాన్ దృష్ట్యా మూడు భాగాల ఫ్రాంచైజీగా దీనిని మలచాలని ప్లాన్ చేస్తున్నట్టు కథనాలొస్తున్నాయి.
అయితే ఈ మూడు భాగాల కోసం రాజమౌళి కనీసంగా 6-8 సంవత్సరాల కాలం తీసుకుంటారు. మహాభారత కథను సినిమాగా మార్చి, కొత్త తరానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మన నిజమైన భారతీయ ఇతిహాసాల గొప్పతనాన్ని చూపించాలని జక్కన్న కోరుకుంటున్నట్టు కథనాలొస్తున్నాయి. అయితే రాజమౌళి ఒకే ఫ్రాంఛైజీకి కట్టుబడి ఎనిమిది సంవత్సరాలు గడపడం అంటే అతడు తన షష్ఠిపూర్తి దశకు చేరుకున్నట్టే. అంటే అది రిటైర్ మెంట్ ఏజ్. రాజమౌళి వయసు ఇప్పుడు 51. మరో 9ఏళ్లలో అతడు మహాభారతం అన్ని భాగాల్ని పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నం చూస్తుంటే, అతడు మరో ఇండియన్ జేమ్స్ కామెరూన్ లా హార్డ్ వర్క్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇటీవల నాని 'హిట్ 3' ప్రమోషనల్ ఈవెంట్లో రాజమౌళి, అంతకుముందు ఓ సందర్భంలో విజయేంద్ర ప్రసాద్ మహాభారతం ప్రాజెక్ట్ ని ఖరారు చేయడంతో అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పలువురు ఫిలింమేకర్స్ మహాభారతం తెరకెక్కిస్తామని ప్రకటించారు. అమీర్ ఖాన్, లింగు స్వామి కూడా రేసులో ఉన్నారు. కానీ వాటన్నిటిపైనా లేని ఆసక్తి రాజమౌళి మహాభారతంపై ప్రజలకు ఉంది.
ఇందులో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ స్టార్లు నటించే అవకాశం ఉంది. అలాగే నానీకి ఒక కీలక పాత్రలో అవకాశం తప్పనిసరి అని రాజమౌళి స్వయంగా అన్నారు. విజయ్ దేవరకొండ, అడివి శేష్ లాంటి ట్యాలెంటెడ్ స్టార్లు నటించే అవకాశం ఉంటుంది. అయితే ఇంతమంది స్టార్లతో పని చేసాక.. అప్పటి ఏజ్ దృష్ట్యా రాజమౌళి కెరీర్‌లో 'మహాభారతం' చివరి ప్రాజెక్ట్ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు.