కార్మిక సమ్మె: ఫెడరేషన్‌తో చర్చల్లో ఏం తేల్చారు?
30శాతం వేతన సవరణను నిర్మాతలు ఆమోదించాలని ప్రతిపాదిస్తూ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) పది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 13 Aug 2025 8:23 PM IST30శాతం వేతన సవరణను నిర్మాతలు ఆమోదించాలని ప్రతిపాదిస్తూ కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) పది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెరుపు సమ్మెతో ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయాయి. తక్కువ వేతనం ఉన్న శ్రమ జీవుల కోసం 15శాతం పెంపును ఆమోదించిన ఛాంబర్- నిర్మాతల మండలి వర్గాలు, దశల వారీగా 5శాతం చొప్పన రెండు సార్లు పెంచుతామని మాటిచ్చింది. కానీ యూనియన్లను విభజించి పాలించడం నచ్చలేదని, అందరికీ 30శాతం పెంపును వర్తింపజేయాల్సిందేనని ఫెడరేషన్ అధ్యక్షుడు అనీల్ వల్లభనేని పట్టుబడుతున్నారు. కార్మికుల తరపున మునుపెన్నడూ లేనంత బలంగా ఆయన బంద్ ని కొనసాగిస్తున్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార ధీక్ష చేయడానికి కూడా వెనకాడబోమని అన్నారు. తమపై కోర్టు కేసులకు సమాధాపనమిస్తామని కూడా అన్నారు.
అయితే పది రోజులుగా చర్చలు యథావిధిగా ఫెయిలవుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా చర్చల కోసం ఫెడరేషన్ తో ఛాంబర్- మండలి భేటీ అయ్యాయి. ఫెడరేషన్ అధ్యక్షుడు సహా ప్రముఖులందరితో నిర్మాతలు సమావేశమయ్యారు. ఛాంబర్ పెద్దలు సమన్వయంతో జరిగిన ఈ చర్చలు మరోసారి విఫలమయ్యాయని తాజాగా తెలిసింది. దీనిని బట్టి 30శాతం పెంపునకు అంగీకరించేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని తేలిపోయింది. బంద్ విరమించేందుకు తాము కూడా సిద్ధంగా లేమని ఫెడరేషన్ పెద్దలు డిసైడ్ చేసారు.
ఈరోజు ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, కోశాధికారి ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. నిర్మాతల మండలి నుంచి దిల్ రాజు, సి.కళ్యాణ్, భోగవల్లి బాపినీడు, ఆచంట గోపీనాథ్, ఠాగూర్ మధు, మైత్రి సీఈవో చెర్రీ, జెమినీ కిరణ్, ఎస్.కె.ఎన్., సుప్రియ యార్లగడ్డ, వివేక్ కూచిబొట్ల, స్రవంతి రవికిషోర్, దర్శకుడు తేజ, వై.వి.ఎస్. చౌదరి, రామ సత్యనారాయణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఫెడరేషన్ తరపు నుంచి ఈ సమావేశంలో ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి కోఆర్డినేషన్ చైర్మన్ వీరశంకర్, అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, కోశాధికారి అలెక్స్, మహిళా ప్రొడక్షన్ హెడ్ లలిత తదితరులు పాల్గొన్నారు.