దసరాకు పోటీ పడనున్న ప్రభాస్, అనుష్క?
ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలూ ఇప్పుడు అక్టోబర్ లో థియేటర్లలోకి రావడానికి చూస్తున్నట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 29 April 2025 8:57 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు టాలీవుడ్ స్వీటీ అనుష్క ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి గతంలో పలు సినిమాలు చేశారు. వీరి జంట స్క్రీన్ పై ఎంతో చూడముచ్చటగా ఉండటంతో పాటూ ఇద్దరూ క్లోజ్ గా ఉండటంతో వారిద్దరి మధ్య ఏదో ఉందని అందరూ వారి గురించి రకరకాలుగా ప్రచారం చేశారు.
ఈ విషయంలో వారిద్దరూ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తున్నప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు మాత్రం ఆగలేదు. బాహుబలి తర్వాత వారి గురించి వార్తలు క్రమంగా తగ్గాయి. ఇక అసలు విషయానికొస్తే వారిద్దరి సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘాటి, ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ కామెడీ థ్రిల్లర్ ది రాజా సాబ్ ఒకేసారి రిలీజ్ కు రెడీ అవుతున్నాయని అంటున్నారు. ముందుగా ఈ సినిమాలను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ లో జాప్యం, పోస్ట్ ప్రొడక్షన్ లేటవడం వల్ల ఈ రెండు సినిమాలూ పోస్ట్‌పోన్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలూ ఇప్పుడు అక్టోబర్ లో థియేటర్లలోకి రావడానికి చూస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో దసరా సీజన్ లో సినిమాలను రిలీజ్ చేసి ఆడియన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వడంతో పాటూ, దసరా సీజన్ ను క్యాష్ చేసుకోవాలని ఆయా చిత్రాల నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరాకు ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఛాన్సుంది. మరి ఇందులో ఏ మేరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.