నయన్ కు చంద్రముఖి మేకర్స్ షాక్.. రూ.5 కోట్లు చెల్లించాలని నోటీసులు
ఇప్పుడు డాక్యుమెంటరీలో రజినీకాంత్ తో నయన్ కలిసి నటించిన చంద్రముఖి మూవీ సీన్స్ ఉండగా. ఆ సినిమా మేకర్స్ స్పందించారు.
By: Tupaki Desk | 8 July 2025 6:57 PM ISTస్టార్ హీరోయిన్ నయనతార నిజ జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్.. నయనతార: బియాండ్ ది డ్రీమ్స్ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. 2024 నవంబర్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీతో నయనతార మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. డాక్యుమెంటరీపై కోర్టును ఆశ్రయించారు. తన పర్మిషన్ తీసుకోకుండా నానుమ్ రౌడీ దాన్ ఫుటేజ్ ను ఉపయోగించారని లీగల్ నోటీసులు పంపించారు. మూడు సెకన్ల క్లిప్ కోసం రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ సినిమాను ఆయనే నిర్మించారు. ఆ కేసు విచారణలో ఉంది.
ఇప్పుడు డాక్యుమెంటరీలో రజినీకాంత్ తో నయన్ కలిసి నటించిన చంద్రముఖి మూవీ సీన్స్ ఉండగా. ఆ సినిమా మేకర్స్ స్పందించారు. తమ అనుమతులు లేకుండా సీన్స్ యాడ్ చేశారని తెలిపారు. వాటిని తొలగించాలని ఇప్పటికే నోటీసులు పంపినా స్పందించలేదట. దీంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
చంద్రముఖి సినిమాలోని కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆ మూవీ కాపీరైట్ పొందిన ఏబీ ఇంటర్నేషనల్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ పిటిషన్ ను మద్రాసు హైకోర్టు విచారించింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. డాక్యుమెంటరీ విడుదల చేసిన తర్వాత ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
కాగా, నయన్ అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయానికొస్తే.. ఇప్పుడు అమ్మడు భారీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. స్టార్ హీరో యష్ టాక్సిక్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మోహన్ లాల్ లీడ్ రోల్ నటిస్తున్న పేట్రియాట్ లో కనిపించనున్నారు.
రక్కాయి, మూకుతి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న మెగా 157లో కూడా భాగమయ్యారు. ఇప్పటికే ఆ మూవీ చిత్రీకరణ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. మరి అప్ కమింగ్ మూవీస్ తో నయన్ ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.