సల్మాన్ ఖాన్ కామెంట్స్ పై రియాక్ట్ అయిన నాని
నేచురల్ స్టార్ నాని హిట్3 ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటూ అడిగిన వాళ్లందరికీ ఇంటర్వ్యూలిస్తూ ప్రతీ దానికి సమాధానమిస్తున్నాడు.
By: Tupaki Desk | 29 April 2025 4:37 PM ISTనేచురల్ స్టార్ నాని హిట్3 ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటూ అడిగిన వాళ్లందరికీ ఇంటర్వ్యూలిస్తూ ప్రతీ దానికి సమాధానమిస్తున్నాడు. అందులో భాగంగానే రీసెంట్ గా సౌత్ ఆడియన్స్ ను ఉద్దేశించి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సికిందర్ ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ పై నాని మాట్లాడాడు.
సికిందర్ ప్రమోషన్స్ లో సౌత్ ఆడియన్స్ తాను రోడ్ పై కనిపిస్తే భాయ్ భాయ్ అంటూ కలవరిస్తారు కానీ థియేటర్లకు మాత్రం రారని, కానీ సౌత్ హీరోలైన రజినీకాంత్, చిరంజీవి, సూర్య లాంటి హీరోల సినిమాలను బాలీవుడ్ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లి మరీ చూస్తారని, సౌత్ ఆడియన్స్ తమపై చూపించే ప్రేమను థియేటర్ల వరకు తీసుకెళ్లరని సల్మాన్ ఖాన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
దీనిపై నాని మాట్లాడుతూ, సౌత్ సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయని, దానికంటే ముందు నుంచే సౌత్ ఆడియన్స్ బాలీవుడ్ సినిమాలను ఆదరిస్తూ, అక్కడి ఎన్నో సినిమాలను ఇక్కడ సూపర్ హిట్లుగా నిలిపారని అన్నాడు. అమితాబ్ నటించిన చాలా సినిమాలు సౌత్ లో కూడా హిట్లుగా నిలిచాయని నాని చెప్పాడు.
హిందీ సినిమాలకు దేశం మొత్తం మీదటా ఆదరణ ఉంటుందని, సల్మాన్ విషయానికొస్తే ఆయనకు సౌత్ లో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారని, ఆయన సినిమాలు కూడా ఇక్కడ హిట్లుగా నిలుస్తున్నాయని నాని చెప్పాడు. హమ్ ఆప్ కే హై కౌన్ సినిమా తనకెంతో ఇష్టమని, దీదీ తేరా దీవానా సాంగ్ సౌత్ లోని ఎన్నో పెళ్లిళ్లలో విన్నానని, సల్మాన్ వ్యాఖ్యలు మనకు తప్పుగా అర్థమయ్యాయేమో అని నాని చాలా పాజిటివ్ గా మాట్లాడాడు.
ఇక హిట్3 విషయానికొస్తే నాని హీరోగా నటించిన ఈ సినిమా హిట్‌వర్స్‌లో భాగంగా తెరకెక్కింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, నాని హిట్3 ను తన సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించాడు.