హిట్ 3 బిజినెస్.. రిలీజ్ కు ముందే సేఫ్ గేమ్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెన్స్‌బుల్ ప్లానింగ్ చేసుకునే హీరోలలో నాని ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
By: Tupaki Desk | 29 April 2025 9:52 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీలో సెన్స్‌బుల్ ప్లానింగ్ చేసుకునే హీరోలలో నాని ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. హీరోగా తన కెరీర్‌ను తీర్చిదిద్దుకోవడమే కాదు, నిర్మాతగా కూడా నిశితమైన ప్రణాళికలతో అడుగులు వేస్తూ సక్సెస్ సాధిస్తూ వస్తున్నాడు. తాజాగా 'హిట్ 3' విషయంలోనూ నాని అదే ఫార్ములాను ఫాలో అయి, మళ్ళీ జాక్‌పాట్ కొట్టేశాడనే చెప్పాలి.
అసలు లైనప్‌లో లేకపోయిన ఈ సినిమా తక్కువ సమయంలో కంప్లీట్ చేసి మే 1న విడుదలకు సిద్ధం చేయడం నాని దూకుడు చాటుతోంది. హిట్ 3 సినిమా అనుకున్న టైమ్ లోనే పూర్తి చేసి విడుదల చేయడం వెనుక నాని వ్యూహం ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే ఈ సినిమాకు దాదాపు రూ.100 కోట్ల మేరకు డీల్ క్లోజ్ అయిందట.
నాని రెమ్యునరేషన్ రూ.25-30 కోట్ల మధ్య ఉన్నా, మొత్తం బడ్జెట్ రూ.80 కోట్లకు మించలేదని అంచనా. అంటే థియేటర్ విడుదలకు ముందే పెట్టుబడి తిరిగి వచ్చేసింది. ఇప్పుడు థియేటర్ల నుంచి వచ్చే ప్రతి రూపాయి లాభంగానే మారబోతోంది. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే హిట్ 3కి అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో వస్తున్నాయి.
బుక్ మై షో డేటా ప్రకారం, విడుదలకు రెండు రోజుల ముందు నుంచే 88 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. లాంగ్ వీకెండ్ కూడా మే 1కి కలిసి రావడం సినిమాకు అదనపు బలంగా మారింది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోయినా, హిట్ 3 కథ, ట్రైలర్ ఇచ్చిన కిక్కుతో భారీగా స్పందిస్తున్నారు.
ఇది చూస్తే నాని ప్రస్తుతం కరెక్ట్ లైన్‌లో ఉన్నాడని చెప్పాలి. చిన్న సినిమా అయిన 'కోర్ట్' విషయంలోనూ ఇదే తంత్రం వాడాడు. అక్కడ కూడా ఓటీటీ హక్కుల రూపంలో పెట్టుబడి రికవరీ అయి, థియేటర్ల నుండి వచ్చే ఆదాయం పూర్తిగా లాభంగా మారింది. అదే ఫార్ములాను ఇప్పుడు మిడ్ రేంజ్ బడ్జెట్ మూవీ అయిన హిట్ 3కి కూడా అప్లై చేసి మళ్ళీ విజయాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. సెన్స్‌బుల్ స్క్రిప్టులు ఎంచుకోవడం, తక్కువ సమయంలో సినిమాను పూర్తిచేయడం, మార్కెటింగ్ స్ట్రాటజీని సమయానికి అమలు చేయడం ఇవే నాని స్టైల్. హిట్ 3లోనూ అదే సక్సెస్ రహస్యం కనిపిస్తోంది. ఇక ఈ సారి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.