నాని సినిమా ఎగ్జిబిటర్లకు ఊపిరిపోసిందా?
వారానికో సినిమా పడితేనే ధియేటర్లు కళకళలాడే పరిస్థితి. కానీ ఇప్పుడు అది లేదు. ఆ సంప్రదాయం కనుమరుగైపోతోంది.
By: Tupaki Desk | 15 May 2025 8:15 AM ISTఒకప్పుడు ఎంత భారీ నిర్మాణ సంస్థ సినిమా చేసినా ముందుగా కథా చర్చల్లో డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఉండాల్సిందే. వాళ్లే కథల్లో ఉన్న లోపాలు, ప్రేక్షకులకు నచ్చే అంశాలని చెప్పేవారు. అంతే కాకుండా సినిమా కథ ఫైనల్ అయ్యాక బడ్జెట్‌లో కొంత భాగాన్ని ముందే నిర్మాతకు అందజేసేవారు. ఇది కొన్నాళ్లు ఓ ఆనవాయితీగా వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాదు. డిస్ట్రి బ్యూటర్, ఎగ్జిబిటర్ నిమిత్త మాత్రులయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు.
దీంతో నిర్మాతకూ వారికి మధ్య దూరం పెరిగిపోయింది. ఆ దూరం థియేటర్ వ్యవస్థ కుదేలవ్వడానికి ప్రధాన కారణంగా మారింది. నిర్మాతకూ, ఎగ్జిబిటర్‌కూ దూరం పెరిగి, సినిమాలో అతని భాగస్వామ్యం లేకపోవడంతో చాలా మంది ధియేటర్ వ్యవస్థకు గుడ్ బై చెప్పేసి షాపింగ్ మాల్స్ లేదా పెళ్లిళ్లకు ఫంక్షన్ హాల్స్‌గా మార్చేసుకోవడం తెలిసిందే. ఓటీటీల ప్రభావం పెరగడం, పాన్ ఇండియా సినిమాలు జోరందుకుని స్టార్ హీరోలు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేసే స్థాయికి వెళ్లడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎగ్జిబిటర్లు కుదేలైపోయారు.
వారానికో సినిమా పడితేనే ధియేటర్లు కళకళలాడే పరిస్థితి. కానీ ఇప్పుడు అది లేదు. ఆ సంప్రదాయం కనుమరుగైపోతోంది. దీంతో థియేటర్లు కాస్తా కళ్యాణ మండపాలుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో నాని చేసిన ఓ చిన్న సినిమా ఎగ్జిబిటర్ల వ్యవస్థకు ఊపిరిపోసింది. అదే 'కోర్ట్'. చిన్న కథతో, నామినల్ బడ్జెట్‌తో నాని సమర్పణలో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలుసృష్టించిందో తెలిసిందే.
ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి,శివాజీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. మార్చి 14న నాని హామీతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో వండర్స్‌క్రియేట్ చేసింది. చిన్న సినిమాగా విడుదలై ఏకంగా రూ.57 కోట్లకు పైనే రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో ఎగ్జిబిటర్లు ఊపిరి పీల్చుకున్నారట. ఇలాంటి చిన్న చిత్రాలు మరిన్ని రావాలని, అలా వస్తేనే ధియేటర్ వ్యవస్థ బతుకుతుందని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి నిర్మాతలు ఈ మాటల్ని ఆలకించి చిన్న చిత్రాలకు పెద్ద పీట వేసి ధియేటర్ వ్యవస్థని కాపాడతారని ఆశిద్దాం.