నేను వాటి వెనుక పరిగెత్తను
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు బాక్సాఫీస్ నెంబర్లు అనేది పెద్ద అంశంగా మారింది. ప్రతీ ఒక్కరూ వాటి గురించే మాట్లాడుతున్నారు.
By: Tupaki Desk | 17 Jun 2025 5:27 PM ISTఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు బాక్సాఫీస్ నెంబర్లు అనేది పెద్ద అంశంగా మారింది. ప్రతీ ఒక్కరూ వాటి గురించే మాట్లాడుతున్నారు. అంతేకాదు, దర్శకనిర్మాతలు కూడా ఆ బాక్సాఫీస్ నెంబర్ల వెనుకే పరిగెడుతున్నారు. అక్కడితో ఆగితే బాగానే ఉంటుంది. కానీ హీరో స్టార్‌డమ్ ను కూడా ఆ బాక్సాఫీస్ నెంబర్ల ఆధారంగానే నిర్ణయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున బాక్సాఫీస్ నెంబర్ల గురించి, రికార్డుల గురించి మాట్లాడాడు.
ఇప్పుడు అందరూ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించే మాట్లాడుతున్నారని, దాని వెనుకే పరిగెడుతున్నారని, కానీ తాను మాత్రం వాటి జోలికి వెళ్లనని, ఎందుకంటే రికార్డులు ఏదొక రోజు బ్రేక్ అవుతాయని, గతంలో తన సినిమాలతో తాను చాలానే రికార్డులు సృష్టించానని, కానీ తర్వాత ఆ రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయని నాగ్ చెప్పాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నాగార్జునకు రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడానికి మీపై ఒత్తిడి లేదా అనే ప్రశ్న ఎదురైంది.
ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ తానెప్పుడూ ఈ నెంబర్లలో చిక్కుకోలేదని, ఈ నెంబర్లన్నీ తాత్కాలికమేనని, ఇప్పుడు రూ.1000 కోట్ల క్లబ్ ఉంటే మరో రెండేళ్లకు అది రూ.2000 కోట్ల క్లబ్ అవుతుందని, తాను నటించిన గత సినిమాలపై ఎన్నో రికార్డులున్నాయని, కానీ ఆ రికార్డు ప్రతీ ఒక్కటీ బ్రేక్ అయిందని, రికార్డు అనేది కొంతకాలం వరకే ఉంటుందని అదే శాశ్వతం కాదని నాగ్ చెప్పాడు.
తాను గత కొన్ని సినిమాలుగా కొత్త తరహా పాత్రలతో ప్రయోగాలు చేయాలని చూస్తున్నానని, బ్రహ్మాస్త సినిమా తన ఆశలకు ఆజ్యం పోసి నటుడిగా తనను కొత్తగా చూపించిందని, ఈ ఇయర్ మరో రెండు విభిన్న రకాల పాత్రల్లో కనిపించబోతున్నట్టు నాగార్జున చెప్పాడు. అందులో ఒకటి ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన కుబేర కాగా, ఆ సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. కుబేరతో పాటూ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న కూలీ సినిమాలో సైమన్ అనే విలన్ పాత్రను చేశానని నాగ్ వెల్లడించాడు. ఈ రెండు సినిమాల్లోని తన పాత్రలు చాలా కొత్తగా ఉంటూనే ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయని నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.