Begin typing your search above and press return to search.

కూలీ తర్వాత... నాగార్జున ఫ్యాన్స్‌లో ఆందోళన

ఇప్పటికే కూలీ సినిమాలో నాగార్జున విలన్ పాత్ర అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఆ విలన్‌ పాత్ర ఎలా ఉంటుంది అనేది చర్చ జరుగుతోంది.

By:  Ramesh Palla   |   13 Aug 2025 9:00 PM IST
కూలీ తర్వాత... నాగార్జున ఫ్యాన్స్‌లో ఆందోళన
X

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మూవీ 'కూలీ' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో అన్ని భాషల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయన దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, అమీర్‌ ఖాన్‌, సౌబిన్‌ వంటి స్టార్స్ ఉన్నారు. పైగా ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందించిన నేపథ్యంలో కూలీ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా ప్రమోషన్‌ సమయంలో నాగార్జున గురించి పెద్దగా హడావిడి లేదు. కానీ సినిమాలో ఆయన పాత్ర మామూలుగా ఉండదని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నాగార్జున చేయని పాత్ర ఇది అని నూటికి నూరు శాతం బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో కూలీ

ఇప్పటికే కూలీ సినిమాలో నాగార్జున విలన్ పాత్ర అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఆ విలన్‌ పాత్ర ఎలా ఉంటుంది అనేది చర్చ జరుగుతోంది. చిన్నా చితకా విలన్‌ అన్నట్లుగా కాకుండా మొత్తం డామినేటింగ్‌ పాత్ర నాగార్జున చేశాడని అంటున్నారు. లోకేష్ కనగరాజ్‌ సినిమాలో ప్రతి పాత్ర చాలా బలంగా ఉంటుంది. అలాంటి లోకేష్ కనగరాజ్‌ ఈ సినిమాలోని విలన్‌ పాత్రను చాలా విభిన్నంగా డిజైన్‌ చేశాను అంటున్నాడు. నాగార్జునకు ఉన్న స్టార్‌ డంను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో ఆయన పాత్ర రూపొందించినట్లు చెబుతున్నారు. కూలీ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సర్‌ప్రైజ్‌ అవుతారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. తాజాగా ముంబైలో కూలీ సినిమా ప్రెస్‌ మీట్‌లోనూ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నాగార్జున బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాప్

కూలీ సినిమాలో నేను చేసిన ఈ పాత్రను నా పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు చూపించాలని అనుకోవడం లేదు. వారికి ఈ సినిమా దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అన్నట్లుగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఎంత వయొలెంట్‌గా పాత్ర ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నా సినిమాలోని నాగార్జున స్టైల్‌, యాక్టింగ్‌ సినిమా ను మరో స్థాయికి తీసుకు వెళ్తాయని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలోనే నాగార్జున ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. నాగార్జున కెరీర్‌ గత కొన్ని సంవత్సరాలుగా నిలకడగా లేదు. ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. చాలా కష్టపడి చేసిన సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పరిచిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో నాగార్జున ఇలా మరో హీరో సినిమాలో కనిపించడం జరిగింది.

హీరోగా నాగార్జున మరిన్ని సినిమాలు చేయాలి

నా సామి రంగ సినిమా తర్వాత ఏడాదిన్నరకు పైగా గ్యాప్‌ తీసుకున్న నాగార్జున ఇప్పటి వరకు సోలో హీరో సినిమాను కమిట్‌ కాలేదు. కుబేర సినిమాలో ధనుష్‌ తో కలిసి నటించిన నాగార్జున, కూలీ సినిమాలో రజనీకాంత్‌ కి పోటీగా నటించాడు. కుబేర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కూలీ సినిమా సైతం రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్ల దిశగా దూసుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా కూలీ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కనుక కూలీ సినిమా విడుదల తర్వాత నాగార్జున ముందు కనీసం పది మంది స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ అయినా నాగార్జునను తమ సినిమాల్లో విలన్‌ పాత్రలో లేదా కీలకమైన క్యారెక్టర్‌ కి గాను సంప్రదించేందుకు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్‌ కి నచ్చే విషయం కాదు. ఎందుకంటే నాగార్జున మరి కొన్నాళ్ల పాటు హీరోగా నటించాలని వారు కోరుకుంటున్నారు. కూలీ హిట్‌ అయితే నాగార్జున తీసుకోబోతున్న నిర్ణయం ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.