Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్ హీరోయిన్ల‌ను అనిల్ లైన్ లో పెట్టాడా?

అయితే అనిల్ కేవ‌లం క‌థ‌తో మాత్ర‌మే కాకుండా క్యాస్టింగ్ తో కూడా సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   30 April 2025 5:00 AM IST
బ్లాక్ బ‌స్ట‌ర్ హీరోయిన్ల‌ను అనిల్ లైన్ లో పెట్టాడా?
X

టాలీవుడ్ లో రాజ‌మౌళి త‌ర్వాత‌ అప‌జ‌య‌మెరుగ‌ని డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ ఏడాది విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌లిసి సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. ఆ సినిమాకు అనిల్ చేసిన ప్ర‌మోష‌న్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆడియ‌న్స్ కు ఏం కావాలి? ఎలా చెప్తే ఒక విష‌యం ఆడియ‌న్స్ వ‌ర‌కు వెళ్తుంది? లాంటి విష‌యాలు అనిల్ కు బాగా తెలుసు.

సంక్రాంతికి వ‌స్తున్నాం త‌ర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమాను అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. చిరూ కోసం అనిల్ నెక్ట్స్ లెవెల్ క‌థ‌ను రెడీ చేశాడ‌ని, సినిమాలో వింటేజ్ చిరూ క‌నిపిస్తాడ‌ని, ఫ్యాన్స్ మెగాస్టార్ ను ఎలా అయితే చూడాల‌నుకుంటున్నారో తాను ఆయ‌న్ని అలానే చూపిస్తాన‌ని ఇప్ప‌టికే చెప్పి ఫ్యాన్స్ లో అంచ‌నాలను పెంచాడు అనిల్.

అయితే అనిల్ కేవ‌లం క‌థ‌తో మాత్ర‌మే కాకుండా క్యాస్టింగ్ తో కూడా సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు. మెగా157 కోసం అనిల్ భారీ క్యాస్టింగ్ ను రంగంలోకి దింపుతున్నాడ‌ని తెలుస్తోంది. గ‌తంలో ర‌జినీకాంత్ తో క‌లిసి చంద్ర‌ముఖిలో న‌టించిన న‌య‌న‌తార‌, జ్యోతిక‌ను ఈ సినిమా కోసం అనిల్ తీసుకుంటున్నాడ‌ని అంటున్నారు.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో న‌య‌న‌తారను చిరంజీవికి జోడీగా సెలెక్ట్ చేశార‌ని, ఈ పాత్ర కోసం ఆమె భారీగా ఛార్జ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇక చిరంజీవికి సోద‌రి పాత్ర‌లో జ్యోతిక క‌నిపిస్తుంద‌ని, సినిమాలో జ్యోతిక పాత్ర చాలా ఎమోష‌న‌ల్ గా ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజ‌మైతే చంద్ర‌ముఖి జంట‌ను అనిల్ మ‌రోసారి క‌లిపిన‌ట్టు అవుతుంది.

ప్ర‌స్తుతం మెగా157 సెకండాఫ్ కు మెరుగులు దిద్దుతున్న అనిల్ రావిపూడి ఆ ప‌ని కోసం వైజాగ్ లో ఉన్నాడు. సెకండాఫ్ లోనే చిరంజీవి క్యారెక్ట‌ర్ చాలా కీల‌క‌మలుపు తీసుకుంటుంద‌ని, అక్క‌డినుంచే అత‌ని పాత్ర కొత్త బాడీ లాంగ్వేజ్ తో పాటూ చిత్తూరు యాస‌లోకి మారుతుంద‌ని, దాని కోసం ఆల్రెడీ రిహార్స‌ల్స్ లో అనిల్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ని అంటున్నారు. సినిమా గురించి, స్క్రిప్ట్ గురించి ఇన్ని విష‌యాలు తెలుస్తున్న‌ప్ప‌టికీ ఆడియ‌న్స్ కు మాత్రం క్యాస్టింగ్ పైనే ఎక్కువ ఆస‌క్తి నెల‌కొంది. చిరూ సినిమాలో న‌య‌న‌తార‌, జ్యోతిక‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ప్రాజెక్టును మ‌రింత సేఫ్ చేయ‌డంతో పాటూ బ‌జ్ కూడా పెరుగుతుంది. వీట‌న్నింటినీ లెక్క‌లో పెట్టుకునే అనిల్ ఈ ప్లాన్ చేశాడ‌ని తెలుస్తోంది. అన్నీ నిజ‌మై, ఈ కాంబో సెట్స్ పైకి వెళ్తే చంద్ర‌ముఖిలానే మెగా157 కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలుస్తుంద‌ని ఫ్యాన్స్ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.