Begin typing your search above and press return to search.

స్టార్స్, సూపర్‌ స్టార్స్‌ని వెనక్కి నెట్టేసిన మహావతార్‌

ఆ భాష.. ఈ భాష అనే తేడా లేకుండా ప్రతి భాషలోనూ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది.

By:  Ramesh Palla   |   11 Aug 2025 6:26 PM IST
స్టార్స్, సూపర్‌ స్టార్స్‌ని వెనక్కి నెట్టేసిన మహావతార్‌
X

యానిమేషన్ మూవీ 'మహావతార్‌ నరసింహా' బాక్సాఫీస్ జోరు కంటిన్యూ అవుతోంది. ఆ భాష.. ఈ భాష అనే తేడా లేకుండా ప్రతి భాషలోనూ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది. ముఖ్యంగా ఈ సినిమా హిందీలో రూ.100 కోట్లకు మించి వసూళ్లు రాబట్టడం ద్వారా రికార్డ్‌ను సృష్టించింది. స్టార్‌ హీరోల సినిమాలు, సూపర్‌ స్టార్‌ హీరోల సినిమాలను సైతం ఈ సినిమా వసూళ్లు బ్రేక్ చేశాయి. 2025 లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ సినిమాల జాబితాలో టాప్‌లో నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా 2025 టాప్‌ లో నిలిచినా ఆశ్చర్యం లేదు. మల్టీప్లెక్స్‌ల్లో ఈ సినిమా ఇప్పటికే 50 శాతంకు పైగా ఆక్యుపెన్సీ నమోదు అవుతున్నట్లు బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

స్టార్‌ హీరోల సినిమాల స్థాయిలో మహావతార్‌ నరసింహా

మౌత్‌ టాక్‌తో ఈ సినిమా రోజు రోజుకు వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు కోటిన్నర రూపాయల వసూళ్లు నమోదు చేస్తే 16 రోజుల తర్వాత రూ.16 కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత రోజుల్లోనూ అదే జోరు కొనసాగుతోంది. హిందీలో ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన తర్వాత మరింతగా పబ్లిసిటీ దక్కింది. మొదటి 15 రోజుల్లో ఈ సినిమా రూ.100 కోట్లు వసూళ్లు సాధిస్తే తర్వాతి వంద కోట్లు వసూళ్లు కేవలం వారం రోజుల్లోనే నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారి అంచనా. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ.210 కోట్ల వసూళ్లు సాధించినట్లు యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు.

హిరణ్య కశిపుడు, ప్రహ్లాదుడి కథ

అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యానిమేటెడ్‌ పౌరాణిక యాక్షన్ చిత్రంలో హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడి కథను చూపించారు. ప్రతి ఒక్కరికీ తెలిసిన కథ అయినప్పటికీ యానిమేషన్ క్యారెక్టర్స్‌తో దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ రూపొందించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమాను భారీగా ప్రేక్షకులు చూస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. దానికి తోడు మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడం వల్ల ప్రేక్షకులు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి.

40 కోట్ల బడ్జెట్‌తో రూ.210 కోట్ల వసూళ్లు

జయపూర్ణ దాస్ రచయితగా వ్యవహరించిన ఈ సినిమా కోసం కాంతార, కేజీఎఫ్‌ నిర్మాణ సంస్థ హంబులే ఫిల్మ్స్ బ్యానర్‌ దాదాపుగా రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు క్లీమ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌ సహ నిర్మాణ సంస్థగా నిలిచింది. ఈ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌కి ప్రేక్షకులు మాస్ హీరో సినిమాల యాక్షన్‌ సీన్స్‌కి వచ్చిన స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. యానిమేషన్‌ మూవీ అయినప్పటికీ ఈ సినిమా పెద్ద ఎత్తున వసూళ్లు రాబడుతోంది. రాబోయే రోజుల్లో అశ్విన్‌ కుమార్‌ నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే అశ్విన్‌ కుమార్‌ తన యూనివర్శ్ నుంచి రాబోయే సినిమాలను ప్రకటించాడు. రెండేళ్లకు ఒకటి చొప్పున అశ్విన్‌ కుమార్‌ యానిమేటెడ్‌ పౌరాణిక సినిమాను విడుదల చేయబోతున్నారు.