సమంత-రాజ్ జర్నీ: సీనియర్ నటి ఆసక్తికర వ్యాఖ్యలు!
మధుమణి తన 39 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, మూడు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 400 సినిమాల్లో నటించినట్లు తెలిపింది.
By: Tupaki Desk | 16 May 2025 5:00 PM ISTసమంత రూత్ ప్రభు తొలిసారి నిర్మాతగా మారిన చిత్రం ‘శుభం’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ మే 15న హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి మధుమణి సమంత, రాజ్ నిడిమోరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘శుభం’ సినిమాకు రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. రాజ్-డీకే దర్శకత్వంలో గతంలో సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్ట్‌లలో నటించింది. ఈ సినిమా సక్సెస్ మీట్లో మధుమణి మాట్లాడుతూ, సమంతతో కలిసి నటించాలనే తన కల ‘శుభం’తో నెరవేరినట్లు తెలిపింది. సమంత, రాజ్ నిడిమోరు సక్సెస్ జర్నీని కొనియాడుతూ, వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది.
మధుమణి తన 39 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, మూడు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 400 సినిమాల్లో నటించినట్లు తెలిపింది. ఎంతోమంది హీరో, హీరోయిన్లకు తల్లిగా నటించినప్పటికీ, సమంతతో మాత్రం ఇప్పటివరకు కలిసి నటించే అవకాశం రాలేదని, ‘రంగస్థలం’లో సమంతకు తల్లిగా నటించే అవకాశం చేజారిపోయిన బాధ తనలో ఉండేదని ఆమె చెప్పింది.
‘శుభం’ సినిమా తన కలను నెరవేర్చినట్లు మధుమణి తెలిపింది. ఈ సినిమా కోసం టీమ్ సంప్రదించినప్పుడు ఎంతో ఆనందించానని, కానీ షూటింగ్ సమయంలో చికెన్ గున్యాతో నాలుగు నెలలు ఇబ్బంది పడ్డానని, ఈ సినిమాను మిస్ అవుతాననే బాధ ఎక్కువగా ఉండేదని ఆమె అన్నారు. అయితే, నాలుగు నెలల తర్వాత మళ్లీ ‘శుభం’తో తన సినీ ప్రయాణం కొనసాగిందని, ప్రస్తుతం ఆరు సినిమాల్లో అద్భుత పాత్రలు చేస్తున్నానని మధుమణి సంతోషం వ్యక్తం చేసింది.
సమంత నిర్మాతగా ‘శుభం’ సినిమాతో మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన వారందరూ మధుమణిని మెచ్చుకుంటూ సందేశాలు పంపారని, ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపింది. సమంతకు అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, రాజ్-సమంత ఈ సినిమాతో మొదలైన ప్రయాణం ఎల్లప్పుడూ సంతోషంగా సాగాలని మధుమణి ఆకాంక్షించారు.