ఇంకేం వినాలో అని భయమేస్తుంది.. దయచేసి ఇక్కడితో ఆపేయండి..
గత వారం రోజులుగా పాడుతా తీయగా ప్రోగ్రామ్ తీవ్ర వివాదానికి గురైంది.
By: Tupaki Desk | 28 April 2025 1:19 PM ISTగత వారం రోజులుగా పాడుతా తీయగా ప్రోగ్రామ్ తీవ్ర వివాదానికి గురైంది. ఈ షోలో జడ్జిలుగా వ్యవహరిస్తున్న కీరవాణి, సునీత, చంద్రబోస్ గురించి సింగర్ ప్రవస్తి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సునీత, కీరవాణి గురించి ప్రవస్తి చేసిన ఆరోపణలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంలో సునీత ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చింది.
అయితే ఈ విషయంలో కొంతమంది సింగర్ ప్రవస్తికి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం సునీత, కీరవాణిను సపోర్ట్ చేస్తూ ఎవరి అభిప్రాయం వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయంలో సీనియర్ డైరెక్టర్, వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన గీతాకృష్ణ, కీరవాణిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కీరవాణి తన దగ్గరకు స్కూల్ గర్ల్స్ ను తీసుకురమ్మంటారని ఎంతో పెద్ద ఆరోపణను చేశాడు.
కీరవాణి గురించి తనకు బాగా తెలుసని, తనపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని గీతాకృష్ణ డిమాండ్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో ఈ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్ కోటి స్పందిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో తప్పు జరిగిందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయని, ఏ ప్రోగ్రాం లోనైనా చిన్న చిన్న తప్పులు జరగడం మామూలేనని ఆయన అన్నారు.
నిజంగా ప్రోగ్రాంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే వాళ్లు చూసుకుంటారని, కీరవాణి గురించి పర్సనల్ గా అలా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలంటూ గీతా కృష్ణ ను అడిగారు. గీతాకృష్ణ గారు మీరు నా ఫేవరెట్ డైరెక్టర్, అప్పట్లో ఎన్నో కొత్త ఆలోచనలతో సరికొత్త సినిమాలు తీసి మీకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు. విశ్వనాథ్ గారి దగ్గర శిష్యరికం చేసి, సక్సెస్ అయిన డైరెక్టర్ గా మీరంటే నాకు ప్రత్యేక అభిమానముందని కోటి అన్నారు.
కీరవాణి, సునీత, చంద్రబోస్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారని, మనందరం ఒక ఫ్యామిలీ అని, మనమంతా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పిన కోటి, కీరవాణి, సునీత ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి, ఇవాళ ఈ స్థాయికి వచ్చారని, ఈ రోజు వాళ్లు జడ్జిలుగా ఉన్నారంటే అదంతా ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ, ఆశీస్సుల వల్లనే అని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు.
కీరవాణి, సునీత గురించి మీరు చేసిన కామెంట్స్ వింటుంటే నాకు చాలా బాధగా ఉందని, బాధతో పాటూ ఇంకేం అంటారో, ఇంకా ఏం వినాల్సి వస్తుందోనని భయంగా కూడా ఉందని, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని, ఈ విషయంలో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టి ఉంటే క్షమించమని కూడా కోటి, గీతాకృష్ణని కోరారు. కోటి మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే కీరవాణిపై లేనిపోని ఆరోపణలు చేసినందుకు అతని ఫ్యామిలీ గీతాకృష్ణపై లీగల్ గా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.